తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయం లో లీడర్షిప్ ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకున్నారనే వార్త ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. స్వతంత్ర భారత చరిత్రలో ఒక పదవిలో ఉన్న ముఖ్యమంత్రి, ప్రపంచంలోనే అత్యున్నతమైన సంస్థలో ఇటువంటి విద్యా కోర్సు కోసం చేరడం ఇదే మొదటిసారి. పరిపాలనా దక్షతను పెంచుకోవడంతో పాటు, అంతర్జాతీయ స్థాయి నాయకత్వ మెళకువలను నేర్చుకోవాలనే ఆయన నిర్ణయం పట్ల అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది.
లీడర్ షిప్ ప్రోగ్రాం విద్యార్థిగా రేవంత్
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నిర్వహించే లీడర్షిప్ ఇన్ ది 21st సెంచరీ -కయాస్, కాన్ఫ్లిక్ట్ అండ్ కరేజ్ అనే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో ముఖ్యమంత్రి చేరారు. ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా సంక్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, సవాళ్లతో కూడిన నిర్ణయాలను ఎలా తీసుకోవాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకత్వ పాత్రను ఎలా బలోపేతం చేసుకోవాలనే అంశాలపై దృష్టి సారిస్తుంది. మారుతున్న ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాలతో ఒక రాష్ట్ర అధినేత ఇటువంటి కోర్సును ఎంచుకోవడం ఆయనకు పాలనపై ఉన్న సీరియస్ నెస్‌ను సూచిస్తోంది.
ఐదు రోజుల పాటు ఫీల్డ్ క్లాసులు
ఈ కోర్స్ కోసం రేవంత్ రెడ్డి ఈ నెల 25 నుంచి 30 వరకు మసాచుసెట్స్‌లోని కెనడీ స్కూల్ క్యాంపస్‌లో ఉండి తరగతులకు హాజరవుతారు. ఐదు ఖండాలనుంచి 20 దేశాల ప్రతినిధులు ఈ కోర్సుకు హాజరు కాబోతున్నారు. వీరితో కలిసి రేవంత్ రెడ్డి తరగతులు, అసైన్మెంట్లు, హోమ్‌వర్క్‌లు పూర్తి చేసి గ్రూప్ ప్రాజెక్టులు కూడా నిర్వహిస్తారు. ఈ కోర్సులో భాగంగా ప్రతినిధి బృందాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, కాలాలు, తరాలనుండి కేస్ స్టడీలను విశ్లేషించి, పరిష్కారాలు రూపొందించి తరగతిలో సమర్పిస్తారు. కోర్స్ పూర్తి చేసిన తర్వాత ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీనుంచి సర్టిఫికెట్ పొందనున్నారు.
రేవంత్ ఇమేజ్ పెరిగే చాన్స్
రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక తన రాజకీయ ఇమేజ్ను మరింత గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలనే వ్యూహం కూడా కనిపిస్తోంది. సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల వ్యూహాలకే పరిమితమవుతారనే విమర్శలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి విద్యార్థిగా మారి విదేశీ విశ్వవిద్యాలయంలో పాఠాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం సానుకూల సంకేతాలను ఇస్తోంది. ఇది కేవలం ఆయన వ్యక్తిగత వికాసానికే కాకుండా, తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో , గ్లోబల్ లీడర్లతో సంబంధాలు పెంపొందించుకోవడంలో కూడా దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని ప్రయత్నం
రేవంత్ రెడ్డి కంటే ముందు పలువురు భారతీయ రాజకీయ నాయకులు విదేశాల్లో చదువుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక లీడర్షిప్ ప్రోగ్రామ్ కోసం హార్వర్డ్‌కు వెళ్లడం మాత్రం అరుదైన విషయమే. ఈ విద్యా యాత్ర ద్వారా ఆయన పొందే అనుభవం రాష్ట్ర పాలనలో, ముఖ్యంగా విధాన నిర్ణయాల అమలులో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో చూడాలి. ఒక గ్లోబల్ ప్లాట్‌ఫారమ్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించడం రాష్ట్ర ప్రతిష్టను కూడా అంతర్జాతీయంగా పెంచే అవకాశం ఉంది.
