రాజకీయాల్లో వంద అనుకుంటారు. ఆరోపణలు చేసుకుంటారు. కేటీఆర్ రేవంత్ రెడ్డిపై, బండి సంజయ్ పై ఎన్నో ఆరోపణలు చేశారు. కానీ కేటీఆర్ పై ఆరోపణలు చేస్తే మాత్రం ఆయన తట్టుకోవడం లేదు. కోర్టుకెళ్తున్నారు. పరువుపోయిందని క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లారు. ఇప్పుడా కేసు నడుస్తోంది. తాజాగా బండి సంజయ్ తో పాటు ఆయన మాటల్ని ప్రసారం చేసిన మీడియా, సోషల్ మీడియా అందరిపై కోర్టుకెళ్లారు.
బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, రూ. పది కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ వేశారు. పిటిషన్ విచారణ జరిపిన కోర్టు కూడా.. బండి సంజయ్ పదిహేనో తేదీన విచారణ కు హాజరు కావాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్.. వాంగ్మూలం ఇచ్చిన రోజున .. కేటీఆర్ పై చాలా ఆరోపణలు చేశారు.వీటిని అన్ని మీడియా సంస్థలు విస్తృతంగా కవర్ చేశాయి. ఇది కేటీఆర్కు కోపం తెప్పించింది. బండి సంజయ్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు. అసలు తాను కేటీఆర్ అనే మాటే ప్రస్తావించలేదని బండి సంజయ్ రిప్లై ఇచ్చారు.
కేటీఆర్ ఆ వివరణకు సంతృప్తి చెందలేదు. అందుకే కోర్టులో పిటిషన్లు వేశారు. నిజానికి వ్యక్తిగతంగా పరువు నష్టం దాఖలు చేసేంత ఆరోపణలు చేసిన కొండా సురేఖ విషయంలో పిటిషన్ వేశారంటే ఓ అర్థం ఉంది కానీ.. ఇలా రాజకీయ ఆరోపణలకూ పిటిషన్లు వేసుకుంటే ఎలా అన్న సందేహాలు రాజకీయవర్గాలకు వస్తున్నాయి. తాను ఇలా పిటిషన్లు వేయాలనుకుంటే.. కేటీఆర్ జీవితాంతం బయటకు రారన్న సెటైర్లు కూడా బండి సంజయ్ వేశారు. ఇదే మొదటి సారి కాదు.. గతంలో రేవంత్ వైట్ చాలెంజ్ చేసినప్పటి నుంచి కోర్టుల్లో చాలా సార్లు పిటిషన్లు వేసి తనపై ఆరోపణలు చేయుకండా ఆదేశాలు కూడా తెచ్చుకున్నారు.


