అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు బాతును చంపేసుకుని ఒక్క సారే అన్ని గుడ్లను తీసుకోవాలని అత్యాశపడుతున్నారు. అందుకే ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ దేశానికి అత్యంత విలువైన మానవ వనరులు రాకుండా చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ వీసాలు.. ఇతర నిబంధనలు పెట్టిన ఆయన H-1B వీసాపై గురి పెట్టారు. ఏడాదికి లక్ష డాలర్ల ఫీజును నిర్ణయించారు. అంటే ఈ వీసా స్పాన్సర్ చేసే కంపెనీ ప్రభుత్వానికి ఏటా ఆ సొమ్ము చెల్లించాలి. ఓ కంపెనీ వంద H-1B వీసాలను తన ఉద్యోగులకు ఇస్తే.. కోటి డాలర్లు చెల్లించాల్సిందే.
ఈ ఫీజు ప్రతి H-1B ఉద్యోగికి ప్రతి సంవత్సరం చెల్లించాలి. అమెరికాలో చదువుకుని అక్కడే H-1B వీసా మీద ఉద్యోగాలు పొందే లక్ష్యంతో చాలా మంది వెళ్తారు. ఇప్పుడు చిన్న-మధ్యస్థ కంపెనీలు లేదా ఎంట్రీ-లెవల్ జాబులకు ఈ వీసాను కంపెనీలు స్పాన్సర్ చేయలేవు. H-1Bలు ఎక్కువగా టెక్ కంపెనీలు గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటివి ఎక్కువగా స్పాన్సర్ చేస్తాయి. భారతీయ IT కంపెనీలు టాటా కన్సల్టింగ్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలకూ సమస్యలు తెచ్చి పెడుతుంది. ట్రంప్ నిర్ణయం ఎంట్రీ-లెవల్” ఉద్యోగాలకు H-1Bలను “అసాధ్యం” చేస్తుంది
గతంలో H-1B ఫీజులు పెరిగినప్పుడు కూడా అప్లికేషన్లు 20-30 శాతం తగ్గాయి. ఇప్పుడు లక్ష డాలర్లు అంటే అది మరింత తీవ్రంగా ఉంటుంది. ట్రంప్ టీమ్ చెప్పినట్టు, ఇది “అమెరికన్ వర్కర్లను కాపాడటానికి” ఉద్దేశించినది కావొచ్చు కానీ.. అమెరికాలో అంత స్కిల్డ్ లేబర్ ఉంటే.. ఆయా కంపెనీలు ఇతర దేశాల నుంచి రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ట్రంప్ నిర్ణయం భారతీయ విద్యార్థులకు.. పెను శాపంగా మారనుంది. స్టూడెంట్ వర్క్ పర్మిట్ నుంచి H-1Bకు మారడం కష్టమవుతుంది. చాలా మంది కలలు చెదిరిపోతాయి. కంపెనీలు హై-సాలరీ రోల్స్ మాత్రమే స్పాన్సర్ చేస్తాయి. హై-స్కిల్డ్, హై-శాలరీ పొజిషన్లకు మాత్రమే స్పాన్సర్ చేస్తాయి.
అమెరికాకు ఎంత నష్టం అని పక్కన పెడితే.. అమెరికా కు వెళ్లడమే లక్ష్యంగా .. కనీసం కోటి పెట్టి తమ పిల్లలను అమెరికా పంపే తల్లిదండ్రులు ఇప్పుడు ఆలోచించాల్సిందే. రాను రాను అమెరికాలో పరిస్థితులు ఇంకా గడ్డుగా మారుతాయి. అమెరికాకు వెళ్లి చదువుకుని తిరిగి రావాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి.