చాలా కాలం తరవాత బాక్సాఫీసు దగ్గర సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఈ సెప్టెంబరులో మంచి సినిమాలే వచ్చాయి. లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి చిత్రాలు మంచి వసూళ్లు సాధించాయి. లిటిల్ హార్ట్స్ చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకొంది. కిష్కింధపురి టాక్ అటూ ఇటుగా ఉన్నా నిలదొక్కుకొంది. మిరాయ్ అయితే తేజా సజ్జా ఖాతాలో మరో వంద కోట్ల సినిమాగా నిలిచిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తు… ఈవారం రాబోతున్న ‘ఓజీ’ మరో ఎత్తు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రోజు రోజుకీ హైప్ ఆకాశాన్ని తాకుతోంది. సుజిత్ ఏదో మ్యాజిక్ చేస్తాడని పవన్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
24 రాత్రి 9 గంటల నుంచే ప్రీమియర్ల హడావుడి మొదలైపోతుంది. తెలంగాణలో ప్రీమియర్ షోల టికెట్ 800 పలుకుతోంది. ఏపీలో కూడా ఇంతే ధర ఉండొచ్చు. ప్రీమియర్లు ఎన్ని ధియేటర్లలో పడితే, అన్ని ధియేటర్లూ హౌస్ ఫుల్స్ అవ్వడం ఖాయం. సినిమా ఏమాత్రం బాగున్నా.. తొలి మూడు రోజుల్లోనే రికార్డు వసూళ్లు చూస్తారు. పవన్ కెరీర్లో ఓజీ కమర్షియల్ గా పెద్ద హిట్ సినిమాగా నిలుస్తుందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు అంచనాకు వచ్చేశాయి. అన్నీ కుదిరితే.. పవన్ ఖాతాలో తొలి రూ.200 కోట్ల సినిమాగా ‘ఓజీ’ నిలిచే ఛాన్స్ వుంది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. అక్కడ ఓజీ సరికొత్త రికార్డులు సృష్టించే ఛాన్స్ కనిపిస్తోంది. నైజాంలో పవన్‌కు తిరుగులేదు. ఓజీ ప్రీమియర్ షోలన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. ‘ఓజీ’ రాకతో ‘మిరాయ్’ దూకుడు తగ్గిపోనుంది. ‘మిరాయ్’కి రెండు వారాల రన్ వచ్చినట్టే. లిటిల్ హార్ట్స్ కూడా ఇప్పటికీ కొన్ని ధియేటర్లలో ఆడుతోంది. ఈ రెండు సినిమాలూ ఓజీకి సైడ్ ఇవ్వాల్సిందే. సెప్టెంబరుని మంచి విజయాలతో ప్రారంభించిన టాలీవుడ్… ‘ఓజీ’తో ఘనమైన ముగింపు ఇవ్వాలని భావిస్తోంది.
