జనసేన పార్టీలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు పవన్ కల్యాణ్ ఇచ్చే కాల్ షీట్ల కోసం ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే పూర్తి కావాల్సిన సినిమాలను పూర్తి చేసి.. ఇంకొక సినిమా చేస్తారని.. ఆ తర్వాత పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. గెలవడానికి ముందే ప్రారంభించిన సినిమాల బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేస్తున్నందుకే విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొత్త సినిమా స్టార్ట్ చేయడం కష్టమే. అయినా బాలినేని మాత్రం ఆశపడుతున్నారు.
ఎందుకంటే.. పవన్ చేస్తారని చెబుతున్న ఆ ఒక్క సినిమాకు నిర్మాత తానే ఉంటానని ఆయన అనుకుంటున్నారు. పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావసభలో తాను జనసేన పార్టీలో రాజకీయ పదవులు ఆశించి చేరలేదని స్వచ్చందంగా చేరానని చెప్పుకొచ్చారు. కానీ తనకు ఒక్క సినిమా చేసే అవకాశం ఇవ్వాలని కోరానన్నారు. చేస్తానని పవన్ మాటిచ్చారని.. ఆ సినిమాను అద్భుతంగా తీయడమే తన లక్ష్యమన్నారు. తన ఆస్తులన్నీ జగన్ లాగేసుకున్నారని కన్నీరు పెట్టుకున్నారు బాలినేని. పవన్ సినిమాతో అవి మొత్తం మళ్లీ సంపాదించుకోవాలని అనుకుంటున్నారు. అందుకే పవన్ ఒక సినిమా చేస్తారని స్వీయ ప్రకటనలు చేస్తున్నారు.
జనసేన పార్టీలో చేరిన తరవాత… ఒంగోలులో చేయడానికి కూడా ఏమీ లేకుండా పోయింది. అక్కడ వ్యవహారాల్లో వేలు పెడితే టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అంగీరించే ప్రసక్తే లేదు. ఆయన అసలు జనసేనలో చేర్చుకోవడాన్నే వ్యతిరేకించారు. అందుకే సైలెంట్ గా ఉన్నారు. అయితే స్థానిక ఎన్నికలు జనవరిలోనే ఉంటాయన్న ప్రచారంతో తన అనుచరుల్ని వేగంగా పార్టీలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పవన్ తో ఓ సభను ఒంగోలులో ప్లాన్ చేశారు.
