పేదల ఆస్తుల విషయంలో ఉన్న అతి పెద్ద సమస్య పూర్వీకుల పేర్లపై ఉండే ఆస్తులను తమ పేర్లపైకి మార్చుకోవడం. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3.91 లక్షల మృత పట్టదారుల భూములు ఇంకా వారి పేర్లలోనే ఉన్నాయి. దీంతో వారసులైన రైతులు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వారసత్వ భూమి రిజిస్ట్రేషన్’ పథకాన్ని ప్రవేశపెట్టింది.
గ్రామ,వార్డు సెక్రటేరియట్లలో రూ.100 లేదా రూ.1,000 మాత్రమే చెల్లించి పేరు మార్పిడి చేసుకోవచ్చని, ఇది భూమి వివాదాలను తగ్గించి రైతులకు సహాయం చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ భూమి రికార్డుల డేటా ప్రకారం, రాష్ట్రంలో 3.91 లక్షల మంది పట్టదారులు మరణించారు, కానీ వారి భూముల పేరు మార్పిడి జరగలేదు. దీంతో వారసులు భూమి ఆధారంగా రుణాలు, ఇన్పుట్ సబ్సిడీలు, పెన్షన్లు వంటి ప్రభుత్వ పథకాల నుంచి దూరమవుతున్నారు. ముఖ్యంగా రైతులు బ్యాంకుల్లో హామీగా భూమి చూపించలేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
గత ఏడాది తాహసీల్దార్ కార్యాలయాల్లో ఈ సమస్యపై 55,000కి పైగా ఫిర్యాదులు వచ్చాయి, ఇవి ఆలస్యం, సిబ్బంది అలసత్వం వల్లే జరిగాయని అధికారులు తెలిపారు. ఈ పథకం కేవలం వారసత్వ ఆస్తులకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర లావాదేవీలు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరగాలి. వారసులు ఒకరికొకరు ఒప్పందం చేసుకుని డెజిటల్ అసిస్టెంట్‌కు సమర్పించినా, రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత స్వయంచాలకంగా మ్యూటేషన్ జరిగి, ఈ-పట్టదార్ పాస్‌బుక్‌లు అందిస్తారు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత, 21.86 లక్షల కొత్త పట్టదార్ పాస్‌బుక్‌లు ఆగస్టు నుంచి మొదటి దశలో విడుదల చేయనున్నారు.