జయలలిత, కరుణానిధి లేని తమిళనాడును దున్నిపారేయాలని దళపతి విజయ్ సొంత పార్టీతో రంగంలోకి దిగారు. కానీ ఆయనది ఆశే కానీ ఆలోచన లేదని జరుగుతున్న పరిణామాలతో స్పష్టమయింది. ఆయనపై ఇప్పుడు ముప్పేట దాడి జరుగుతోంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై హైకోర్టు ముధురై బెంచ్‌లో జరిగిన విచారణ, న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలతో విజయ్ వ్యవహారం మరో సారి ప్రజల్లో చర్చనీయాంశమయింది. విషాదం జరిగినప్పుడు ఆయన పారిపోయారన్న ప్రచారంతో విజయ్ ఇమేజ్‌కు పూర్తి డ్యామేజ్ అయింది. రాజకీయాల్లో ఏది జరగకూడదో.. విజయ్ విషయంలో అదే జరిగింది.
గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకున్న విజయ్
విజయ్ రాజకీయంగా ప్రభావం చూపించడం ఖాయం. కొత్త లీడర్ వచ్చాడు అంటే పాత లీడర్లందరిపై జనానికి మొహం మొత్తితే .. ఆ కొత్త లీడర్ ను వెంటనే నెత్తిన పెట్టేసుకుంటారు ప్రజలు. అనాదిగా. భారత ప్రజాస్వామ్యంలో ఇదే జరుగుతోంది. తమిళనాడులోనూ అలాంటి పరిస్థితి వస్తుందని విజయ్ నమ్మకంగా ఉన్నారు. అందుకే పొత్తుల గురించి ఎక్కువ ఆలోచించుకుండా పని చేసుకుంటున్నారు. కానీ ఆయన తనపై జరిగే రాజకీయాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. జాగ్రత్తలు తీసుకోలేకపోయారు.
కరూర్ ఘటనపై సమాధానం చెప్పుకోలేని పరిస్థితి
రాజకీయాల్లో ఇలాంటి ఘోరాలు జరుగకుండా పార్టీలు పక్కాగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతా అయిపోయాక.. తప్పు మీదంటే మీదని నిందలు వేసుకుంటే ప్రయోజనం ఉండదు. జరగాల్సిన నష్టం జరుగుతుంది. కరూర్ ఘటన విషయంలో విజయ్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా అందరి కళ్ల ముందే ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా ఆయన బాధితులకు అండగా ఉండకుండా చెన్నై వెళ్లిపోయారు. మూడు రోజుల పాటు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాతే వీడియో విడుదల చేశారు. నటుడు కాబట్టే.. అలా వెళ్లిపోయారని.. ఇంకా ఆయన రాజకీయం నేర్చుకోలేదని అప్పుడే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఆయన తీరు నటుడిలా ఉంది కానీ.. రాజకీయ నేతగా లేదు.
ఈ సవాల్ అధిగమించితేనే రాజకీయంగా భవిష్యత్
విజయ్ తన సినీ ఇమేజ్ను ఉపయోగించుకుని .. జోసఫ్ విజయ్ అనే పేరును ఉపయోగించుకుని కొంత స్థిరమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలన్న టార్గెట్ తో రాజకీయం చేస్తున్నారని ప్రజలు అనుకుంటే టీవీకే పార్టీ.. తమిళనాడు లో ఉన్న అనేక పార్టీల్లా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే విజయ్.. తన రాజకీయంలో అసలైన సవాల్ ఎదుర్కొంటున్నారు. ప్రారంభంలోనే ఇలాంటి సవాల్ ఎదురయిందంటే.. దీన్ని ఎదుర్కొంటే.. తిరుగులేని నాయకుడు అవుతారు. కానీ ఇప్పటివరకూ అలాంటి కాన్ఫిడెన్స్ విజయ్ లో కనిపించలేదన్న అభిప్రాయం తమిళనాట వ్యక్తమవుతోంది.