బీహార్లో తుది ఓటర్ల జాబితా ప్రకటించి వారం రోజులు దాటిపోయింది. నేడో , రేపో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతున్నారు. ఓటు చోరీ అంటూ హడావుడి చేసిన కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీతో ఫలానా చోట ఓట్ల చోరీ జరిగిందని నిర్దారించలేకపోయాయి. రాహుల్ గాంధీ కొలంబియాకు పోయి అక్కడ ఇండియాలో ఓటు చోరీ గురించి ప్రసంగాలు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యం బలహీనపడిందని అంటున్నారు. కానీ చేస్తున్న ఆరోపణలు నిరూపించాల్సిన అవసరం ఉన్నా ఆయన పట్టించుకోవడంలేదు.
బీహార్లో లక్షల ఓట్ల తొలగింపు – అందులో చోరీ లేదా ?
బీహార్ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టారు. దాదాపుగా 70 లక్షల ఓట్లను తొలగించి ముసాయిదా జాబితా విడుదల చేశారు. చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు ఇలా ఓటర్ల జాబితాలో ఉండకూడదని అనుకున్న వారిని తప్పించారు. ఈ విధానాన్ని కాంగ్రెస్ ఖండించింది. ఓట్ల చోరీ కోసమే ఇలా చేస్తున్నారని మండిపడింది. అయితే ఆ 70 లక్షల మంది నిజమైన ఓటర్లు అని.. నిరూపించలేకపోయింది. కనీసం లక్ష ఓట్లు గల్లంతు అయినా జాతీయ స్థాయిలో ఇష్యూ అయ్యేది . కానీ తమ ఓటు గల్లంతు అయిందని ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
అసలు బీహార్ లో చేయాల్సిన పని చేయుకుండా కర్ణాటక ఓటర్ జాబితాలతో రాజకీయం
బీహార్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్ల జాబితాలను సవరించారు. ఆర్జేడీకి, కాంగ్రెస్ కు బీహార్ లో గ్రామ గ్రామాన క్యాడర్ ఉంటుంది. ఓట్లు గల్లంతు అయితే వెంటనే కనిపెట్టడం పెద్ద విషయం కాదు. కానీ ఏ ఒక్క విషయాన్నీ చెప్పడం లేదు. అదే సమయంలో రెండు సార్లు ప్రెస్ మీట్లు పెట్టి తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఓటర్ జాబితాలో అవకతవకలు బయట పెట్టి అదే పెద్ద ఓటు చోరీ అంటున్నారు. కానీ ప్రజలకు మాత్రం అదేం ఓటు చోరీ అన్నది క్లారిటీ రావడం లేదు. వారిని నమ్మించలేకపోతున్నారు.
రాహుల్ గాంధీ రాజకీయం కామెడీ గా మారుతోందా?
బీజేపీపై చేయాల్సిన యుద్ధాన్నీ ఎన్నికల సంఘంపై చేస్తూ రాహుల్ ఇప్పటికే కామెడీ అయ్యారు. ఆ యుద్ధానికి బేస్ లేకుండా ఆయన చేస్తున్న పనులు కాంగ్రెస్ పార్టీ వారసుడి రాజకీయ చేతకాని తనాన్ని ప్రజల ముందు పెడుతున్నాయి. ఇప్పటి వరకూ ఆయనకు మద్దతుగా ఉండే వారు కూడా.. ఆయనను సమర్థించలేని రాజకీయం. చేస్తున్నారు. ఇలాంటి నాయకత్వంతో ఆయన బీజేపీని, మోదీని ఎలా ఓడించగలరని మధనపడే పరిస్థితి తీసుకొచ్చారు.