బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 22లోపు కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉండటంతో రెండు విడతల్లోనే ఎన్నికలు పూర్తి చేయబోతున్నారు. ఈ రెండు విడుతలకూ పెద్దగా గ్యాప్ లేకుండా ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేశారు. తొలి విడత నామినేషన్లు పదమూడో తేదీ నుంచి, రెండో విడత నామినేషన్లు 13వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. పోలింగ్ నవంబర్ 6న మొదటి విడత, 11వ తేదీన రెండో విడత జరుగుతుంది. పధ్నాలుగో తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
బీహార్ ఎన్నికల కోసం అటు బీజేపీ కూటమి.. ఇటు ఆర్జేడీ కూటమి పూర్తిగా సిద్ధమయ్యాయి. వరుసగా గెలుస్తూ వస్తున్న నితీష్ కుమార్ మరోసారి కూటమిని నడిపిస్తున్నారు. ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని .. ఆర్జేడీ, కాంగ్రెస్ నమ్ముతున్నాయి. అయితే ఆ పార్టీ ప్రజా సమస్యలు కాకుండా.. పూర్తిగా ఓట్ల చోరీ అంటూ రాజకీయం చేస్తూ వస్తోంది. మరో వైపు ప్రశాంత్ కిషోర్ కూడా తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. జనసురాజ్ పార్టీ కింగ్ మేకర్ అవుతుందని ఆయన నమ్ముతున్నారు. ఆయన స్ట్రాటజీలు ఆయనకు ఎంత మేర వర్కవుట్ అవుతాయో వేచి చూడాల్సి ఉంది.
బీహార్ ఎన్నికల్లో రెండు కూటముల మధ్య ప్రధానంగా పోటీ జరగనుంది. పెద్దగా సమయం లేకుండానే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అందుకే సీట్ల సర్దుబాటు సహా.. ప్రచారం ఇతర అంశాలతో రెండు కూటముల్లోనూ తీవ్ర కుమ్ములాటలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. నితీష్ కుమార్ .. తన పార్టీ ఎక్కువ సీట్లలో పోటీ చేసేలా ప్రయత్నించే అవకాశం ఉంది. ఆర్జేడీ కాంగ్రెస్ కు వీలైనన్ని తక్కువ సీట్లు ఇవ్వాలనుకుంటోంది. మొత్తంగా అసలైన ఎలక్షన్ సర్కస్ బీహార్ లో ప్రారంభమయింది.