తెలుగు పరిశ్రమలో దిగ్గజం లాంటి నిర్మాత దిల్ రాజు. ఆయన బ్యానర్ కు ఓ క్రేజ్ ఉంది. ఆయన పేరే ఓ బ్రాండ్. నిర్మాతగా, పంపిణీదారుడిగా, ఎఫ్డీసీ ఛైర్మన్గా చాలా రకాల బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఇప్పుడు నటుడిగానూ మారారు. ‘మిత్రమండలి’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించబోతున్నారు దిల్ రాజు. దీనికి సంబంధించిన షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లోని దిల్ రాజు ఆఫీసులోనే జరిగింది. దిల్ రాజు, సత్యలపై ఓ సరదా సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ వాస్ ని డిస్టిబ్యూటర్ గా మార్చింది దిల్ రాజునే. ఇప్పుడు దిల్ రాజుని బన్నీ వాస్ నటుడిగా మార్చారన్నమాట.
ఈనెల 16న ‘మిత్రమండలి’ విడుదల అవుతోంది. దీపావళి కానుకగా వస్తున్న ఈ సినిమా నవ్వులు పంచుతుందని చిత్రబృందం బలంగా నమ్ముతోంది. బుధవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యే అవకాశం ఉంది. రాగ్ మయూర్, మ్యాడ్ ఫేమ్ విష్ణు, ప్రసాద్ బెహర, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోషల్ మీడియా స్టార్ నిహారిక కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలైపోయాయి. బన్నీవాస్ ఇటీవల నిర్మాణ భాగస్వామ్యం వహించిన ‘లిటిల్ హార్ట్స్’ మంచి విజయం అందుకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనూ ఫామ్ కొనసాగించాలని ఆయన భావిస్తున్నారు. ఈ దీపావళికి నాలుగు సినిమాలు రాబోతున్న నేపథ్యంలో బన్నీవాస్ ప్రమోషన్ల పరంగా స్పీడు పెంచబోతున్నారు.