వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి తానే ప్రతిపక్షం అనిపించుకోవాలని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అనుకుంటున్నారేమో కానీ ఆయన ఇటీవల చేస్తున్న జర్నలిజం.. ఆయన మార్క్ ప్రమాణాలను అందుకోవడం లేదని ఇప్పటి వరకూ ఆయనను అభిమానించిన వారు కూడా అంటున్నారు. గతంలో ఆయన జగన్ కు వ్యతిరేకంగా.. టీడీపీకి సపోర్టుగా జర్నలిజం చేసినా.. ఎక్కడా లాజిక్ మిస్సయేది కాదు. ఆయన చెప్పేదాంట్లో నిజం ఉంది కదా అనుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మాటలు.. ఆయన మీడియాలో వస్తున్న కథనాలు, చర్చలు చూసి.. ఏ మాత్రం పొసగడం లేదని అనుకుంటున్నారు.
కొత్తపలుకులో ఆర్కే బాలకృష్ణపై వ్యాఖ్యలు చేసిన తర్వాత టీడీపీలో చాలా మంది ఆయనలో అవకాశవాదం చూస్తున్నారు. నిజాలు చెప్పకపోవడం.. పైగా అబద్దాలు చెబుతున్నారని సాక్ష్యాలతో సహా వెల్లడిస్తున్నారు. ఎన్టీఆర్ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సందర్భం వేరు.. కానీ ఆర్కే చెప్పింది వేరు. నన్నపనేనిపై ఎన్టీఆర్ అసభ్యంగా మాట్లాడారని ఆర్కే చెబుతున్నారు. అలాగే బాలకృష్ణ కాల్పుల కేసులో వైఎస్ కాపాడారని చెప్పడం.. వైఎస్ చంద్రబాబు నుంచి పొందిన సాయాల గురించి చెప్పకపోవడంపైనా టీడీపీ నేతలకు కోపం వచ్చింది. అదే సమయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ లో వస్తున్న కథనాలు, డిబేట్లు తేడాగా ఉంటున్నాయి.
పనిగట్టుకుని స్పేస్ లేకపోయినా ప్రభుత్వాన్ని విమర్శించాలన్నట్లుగా ఈ కథనాలు, చర్చలు సాగుతున్నాయి. ప్రతిపక్షం లేదు కాబట్టి తామే ప్రతిపక్షం అని గట్టిగా ఫీలయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అది చాలా ఎబ్బెట్టుగా ఉంది. గతంలో ప్రభుత్వంలో వైసీపీ అధికారుల హవా అని చెప్పేందుకు చాలా కథనాలు రాశారు. వైసీపీ వాళ్లకే మేలు జరుగుతోందని కొన్ని రాశారు. కానీ ప్రతి దానికి రెండు కోణాలు ఉంటాయని ఆయన అనుకోవడం లేదు. మొత్తంగా ఆర్కే .. గందరగోళంలో ఉన్నారు. దానికి కారణం ఏమిటో కానీ.. లైన్ తప్పారని ఎక్కువ మంది అనుకుంటున్నారు. సోల్ మిస్సయితే ఏ మీడియా సంస్థకు అయినా మనుగడ కష్టమే. ఆ సోల్ ఏంటో ఆర్కేకు తెలియకుండా ఉండదు !