జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమికి సేవ చేద్దామని అమెరికా నుంచి వచ్చిన వారిని కూడా దండం పెట్టి వెళ్లిపొమ్మని మేమే చెబుతున్నామన్న పద్దతిలో పారిశ్రామిక పాలసీ ఉండేది. అప్పుడు వారికి పెట్టుబడులు వద్దు.. ఉద్యోగాలు వద్దు.. అందర్నీ బిచ్చగాళ్లుగా చేసి తాము వేసే బిచ్చం తీసుకుని ఓట్లు వేస్తే చాలనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. దేశంలోనే అతి పెద్ద ఎఫ్డీఐలు వస్తున్నాయి. పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. అప్పట్లో పెట్టుబడుల్ని తరిమేసిన వాళ్లు ఊరుకుంటారా.. ఇప్పుడు ఆ పెట్టుబడులపైనా ఏడుస్తున్నారు. కుట్రలు చేస్తున్నారు.
నీరు, కరెంట్ అవసరాలు కూడా తీర్చకుండా పెట్టుబడులు పెడతారా?
డేటా సెంటర్ల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని.. ఉద్యోగాలు రావని.. నీరు భారీగా ఖర్చు అవుతాయని కొత్తగా వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. ఏమీ అవసరం లేకుండా.. ఏ అవసరాలు తీర్చకుండానే వచ్చి పెట్టుబడులు పెట్టేస్తారా ?. డేటా సెంటర్లకు ప్రభుత్వం తరపున కల్పించే సౌకర్యాలు చాలా తక్కువ. వారికి కావాల్సిన నీరు, విద్యుత్ ను వారే సమకూర్చుకునేందుకు వేల కోట్లు ఖర్చు పెట్టేలా తమ డీపీఆర్ లో పెట్టుకున్నారు. గూగుల్ రూ.యాభై వేల కోట్లతో డేటా సెంటర్ పెడితే.. ఇందులో ఇరవై వేల కోట్లు విద్యుత్ నీరు సమకూర్చుకునేందుకు ఖర్చు పెడుతోంది. కొత్తగా ఆసక్తి వ్యక్తం చేసిన రైడెన్ ఇన్ఫోటెక్ అయినా అంతే. కానీ డేటా సెంటర్లు పెడితే కరువు వచ్చేస్తుందని అతి తెలివి చూపిస్తున్నారు.
జగన్ రెడ్డి ఫేక్ పెట్టుబడులు తెస్తే ఆహా..ఓహో అంటారా?
అదే జగన్ రెడ్డి హయాంలో అదానీకి డేటా సెంటర్ పెడుతున్నారంటే.. ఆహా..ఓహో అని ఈ పెద్ద మనుషులే ప్రచారం చేశారు. ఆ డేటా సెంటర్ కు భూమి లీజుకు ఇవ్వడం కాదు.. ఏకంగా కొండను రాసిచ్చేశారు. ఇప్పుడు గూగుల్ కోసం ఎక్కడో భూములు ఇస్తూంటే.. మాత్రం కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేయడం..గూగుల్ కు మెయిల్స్ పెట్టడమే కాదు.. వాటి వల్ల సమస్యలు అని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల పైసా ప్రయోజనం ఉండదు కానీ.. భవిష్యత్ ను దెబ్బతీయడానికి మాత్రం ఖర్చు లేకుండా కష్టపడతారు.
ఏ రాష్ట్రంలోనూ ఉండని రాజకీయం
రాష్ట్ర ప్రయోజనాలు, యువత ప్రయోజనాలను చూసుకునేలా ఇతర పార్టీల రాజకీయాలు ఉంటాయి. తెలంగాణలో పెట్టుబడుల్ని కేటీఆర్ ఏ మాత్రం వ్యతిరేకించరు. వెళ్లిపోతున్నాయని.. వాటిని ఆకర్షించాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. తమిళనాడు, కర్ణాటకలోనూ అంతే. కానీ ఏపీ దౌర్భాగ్యం ఏమిటంటే.. ఏపీకి ఎంతో కష్టపడి పెట్టుబుడులు తెస్తూంటే.. వాటిని వెళ్లగొట్టేందుకు మాత్రం రెడీగా ఉంటారు. ఇలాంటి రాజకీయనేతల్ని భరించడం ఏపీ ప్రజలకే సాధ్యం.