“ చరిత్రలో నిలిచిపోయిన గొప్ప విజయాలన్నీ హోరాహోరీగా సాగిన పోరులో సాధించేవే. ఏకపక్షంగా సాగే పోరాటాల్లో విజయాలకు ఆ గుర్తింపు రాదు. ఇలాంటి పోరాటాల్లో గెలిస్తేనే చరిత్ర ”. .
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా అలాంటి విజయాన్ని నమోదు చేయబోతోంది. ఐదు సంవత్సరాల పాటు తనపై దాడిని ఏకపక్ష దాడిని తట్టుకుని నిరంతరం జరిగిన కుట్రలను ఎదుర్కొని కూడా నిటారుగా నిలబడిన ఏపీ రాజధాని ఇవాళ.. మెల్లగా పరుగందుకుంటోంది. ఆ వేగం రానున్న రోజుల్లో వందలు, వేల కిలోమీటర్లను అందుకుంటుంది. ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడేందుకు ఆత్మవిశ్వాసంతో పరుగులు పెడుతోంది. అక్టోబర్ 13వ తేదీన సీఆర్డీఏ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించబోతున్నారు. ఇది అమరావతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా నిర్మించిన మొదటి భవనం. 2019 వరకూ ఈ భవనం 50 శాతం పూర్తి అయింది. జీ ప్లస్ 7 వరకూ శ్లాబులు పూర్తయ్యాయి. అప్పుడే ప్రభుత్వం మారింది. ఐదు ఏళ్ల పాటు ఆ భవనం శిథిలంగా మారింది. అలా వదిలేస్తే సరేలే అనుకుంటారేమో కానీ ఆ భవనం ప్లాన్లలో మార్పులు చేసి.. లిఫ్ట్ కూడా లేకుండా కొన్ని పనులు చేసి ఉన్నది చెడొగట్టారు. అక్కడ ఎంత కుట్ర ఉన్నదంటే..భవనాన్ని పనికి రాకుండా చేయాలనుకున్నారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత .. అన్ని లాంఛనాలు పూర్తి చేసి …పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేశారు. ఇప్పుడు సీఆర్డీఏ భవనం అంతర్జాతీయ ప్రమాణాలతో సర్టిఫై అయిన భవనం.
ఐదేళ్ల పాటు ఏపీ రాజధానిపై హత్యాయత్నాలు
అమరావతిలో ఇది మొదటి భవనం ప్రారంభోత్సవం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తొలి ఐదేళ్లలో రాజధానిగా అమరావతిని ఖరారు చేసి ..భూమీకరణ చేసి.. మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవడమే కాదు.. పెట్టుబడిదారుల్ని వెదుక్కుని పనులు ప్రారంభించేసరికి మూడేళ్లు అయింది. నిజానికి ఈ మూడేళ్లలో అత్యధిక భాగం వైఎస్ఆర్సీపీ నేతలు గ్రీన్ ట్రిబ్యూనల్ సహా రైతుల పేరుతో ప్రపంచబ్యాంక్ వద్ద కూడా పెట్టిన పిటిషన్లు, మెయిల్స్ కారణంగానే ఎక్కువ సమయం వృధా అయింది. అయినా ప్రభుత్వం ఎన్నికలు వచ్చే ముందు రెండేళ్లలో రూ. 50 వేల కోట్ల పనులు ప్రారంభించింది. సచివాలయాన్ని అమరావతికి తీసుకెళ్లారు. హైకోర్టును కూడా పూర్తి చేశారు. కానీ సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ లో అవి శాశ్వత సచివాలయం కాదు. నిర్మాణాలు శాశ్వతమే. కానీ మాస్టర్ ప్లాన్‌లో జీఎడీ టవర్స్ వేరుగా ఉంటాయి. తాత్కలికంగా ఉపయోగించుకోవడానికి తర్వాత వాటిని మరో రకమైన ప్రభుత్వ జిల్లా కార్యాలయాలుగా వినియోగించడానికి నిర్మించారు. హైకోర్టు కూడా జిల్లా కోర్టు కోసం నిర్మించారు. శాశ్వత హైకోర్టు నిర్మాణం తర్వాత ప్రస్తుత హైకోర్టును జిల్లా కోర్టుగా వినియోగిస్తారు. కానీ అంతా తాత్కలికమే అన్నట్లుగా ప్రచారం చేసి.. ప్రజల్ని రెచ్చగొట్టి రాష్ట్రానికి తీరని నష్టం చేశారు. ఐదు సంవత్సరాల పాటు వారు అమరావతిపై ప్రతీ రోజూ హత్యాయత్నం చేశారు. పనులు నిలిపివేయడమే కాదు.. నిరంతరం భూములు ఇచ్చిన రైతుల్ని హింసించడం దగ్గర నుంచి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడని రోజే లేదు. వ్యవస్థలలలో ఉన్న లోపాలను ఆధారంగా చేసుకుని సొంత రాజధానిపై భయంకరమైన కుట్రలు పన్నిన రాష్ట్ర ప్రభుత్వాలను ప్రపంచంలో మరెక్కడా చూసి ఉండరు. అంతా మసి చేశామని వికటాట్టహాసం .. ఓడిపోయే వరకూ చేస్తూనే ఉన్నారు.
ఎప్పటికీ కోలుకోలేని విధంగా చేయాలనుకున్న నాటి పాలకులు
రాజధానిని చంపేయాలని చూసిన వారు వారు చేసిన హత్యాయత్నాలు చిన్నవి కావు. ఒక వేళ తాము ఓడిపోయినా చంద్రబాబు వచ్చినా రాజధాని నిర్మించలేకుండా పునాదుల్ని.. నమ్మకాన్ని కూడా కుప్పకూల్చే ప్రయత్నం చేశారు. సింగపూర్ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడమే కాదు వారు అవినీతి చేశారని కేసులు పెడతమని బెదిరించారు. ఎన్నో సంస్థలపై కేసులు పెట్టారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కరంటే ఒక్క పారిశ్రామికవేత్త కూడా అమరావతివైపు రాకుండా చేయాలనుకున్నారు. జగన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై నమ్మకాన్ని, ప్రజలపై విశ్వాసాన్ని కూడా చంపేసే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఆయన చాలా వరకూ విజయం సాధించారు. ఎంతగా అంటే.. ఇక అమరావతి కలేనని అక్కడ రూపాయి పెట్టుబడి పెట్టినా వృధానేనన్నంతగా పొడిచి పొడిచి హత్యాయత్నం చేశారు. కొన ఊపిరితో ఉన్న రాజధానికి ప్రజలు మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీ ఇవ్వడం ద్వారా ప్రాణం పోశారు. జరిగిన నష్టం జరిగిపోయింది..దాని గురించి ఆలోచించుకుంటే..బాధపడితే ఏమీ జరగదని .. ప్రమాణ స్వీకారం ముందు నుంచే పనులు ప్రారంభమయ్యేలా చేశారు చంద్రబాబు. జంగిల్ క్లియరెన్స్ కే మూడు నెలలు పట్టిందంటే చిన్న విషయం కాదు. జగన్ రెడ్డి నరికేసిపోయిన నమ్మకాన్ని పోగు చేసుకుని అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు, కేంద్రం నుంచి నిధులు సమీకరించుకునేందుకు చంద్రబాబు కిందా మీదా పడ్డారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. రాజధానికి నిధుల సమస్య లేకుండా పోయింది. ప్రభుత్వం కేవలం రైతులకు కౌలు చెల్లిస్తే చాలు.. మిగతా అంతా రాజధానికి గ్రాంట్లు, లోన్ల రూపంలో వస్తాయి. అమరావతి అభివృద్ధి తర్వాత ఆ లోన్లను ప్రభుత్వం భూముల అమ్మకం ద్వారా తీర్చేస్తుంది. గ్రాంట్లను కేంద్రం భరిస్తుంది. అందుకే ఇప్పుడు.. అమరావతిలో ఎక్కడ చూసినా పనులు జరుగుతూ కనిపిస్తున్నాయి.
సొంత రాష్ట్ర రాజధానిపై కుట్రలు – మూర్ఖుల రాజకీయం
ఒక్క మధ్యతరగతి మనిషి తన ఇంటిని ఐదు సంవత్సరాల పాటు నిర్మాణం ఆపేసి.. ఐదేళ్ల తర్వాత మళ్లీ ప్రారంభించాలనుకుంటే ఎంత కష్టమో ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. అప్పటి వరకూ పెట్టిన ఖర్చు కాక.. రెట్టింపు ఖర్చు అవుతుంది. ఐదు సంవత్సరాల కిందట ఉండే రూపాయి విలువ.. ఇప్పుడు ఉండే రూపాయి విలువకు పొంతన ఉండదు. అప్పట్లో ఇరవై లక్షలు పెట్టి ఇళ్లు నిర్మించాలని ప్లాన్ చేసుకుంటే.. ఐదు సంవత్సరాల తర్వాత అది 30 నుంచి 40 లక్షల రూపాయలు అవుతుంది. పైగా అప్పటి వరకూ కట్టిన కట్టుబడి పనికి వస్తుందా లేదా అన్న టెన్షన్ ఉంటుంది. అలాంటిది.. రూ. యాభై వేల కోట్లతో తలపెట్టిన రాజధాని నిర్మాణం ఐదేళ్ల పాటు ఆపేస్తే.. జరిగే నష్టం ఎంత ఉంటుందో అంచనా వేయడం పెద్ద కష్టం కాదు. అదే సమయంలో భూములు ఇచ్చిన రైతులపై జరిగిన దాడులు, పెట్టిన కేసులు అన్నీ ఇన్నీ కావు. అన్ని దాటుకుని ప్రాణం నిలుపుకున్న అమరావతిలో ఇప్పుడు పూర్వ వైభవం కనిపిస్తోంది. రాజధానిలో ఎక్కడ చూసినా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనుల పురోగతి కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు. ఈ ఎస్పీవీ ద్వారా మెగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం రూ. 64,910 కోట్ల పనులు జరుగుతున్నాయి. భారీగా ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల సందర్శించి పురోగతిని ప్రశంసించింది. ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ , రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ , రోప్‌వే , ఇన్నర్ రింగ్ రోడ్ , రాజ్‌భవన్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ , క్వాంటమ్ సిటీ వంటివి మెగా ప్రాజెక్టులుగా మారాయి.
సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలే రాజధాని కాదు !
అందరూ అమరావతిలో సచివాలయం, హైకోర్టు, రాజ్ భవన్, అసెంబ్లీ కడితే అదే రాజధాని అనుకుంటున్నారు. అవి పూర్తి చేస్తే రాజధాని తరలించబోమని.. చేయకపోతే మళ్లీ మేము గెలిచి మూడు రాజధానులు అంటామని వైసీపీ నేతలంటున్నారు. కానీ ప్రభుత్వం దృష్టిలో ప్రజారాజధాని అంటే.. కేవలం పరిపాలనా భవనాలు కాదు. విద్యా, వైద్య, ఉపాధి కేంద్రంగా రాజధానిని మార్చాలన్నదే లక్ష్యం. కష్టమెందుకు జరిగేదేదో జరుగుతుదంని …నాలుగు బిల్డింగులు నిర్మించుకుని పాలన చేయాలన్నది వారి ఆలోచన. కానీ ప్రపంచంతో పాటు పరుగు అందుకోవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఇప్పుడు అమరావతిలో ప్రపంచస్థాయి యూనివర్శిటీలు ఉన్నాయి. అవి వందల కోట్లు పెట్టి తమ క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయి. అంతర్జాతీయ యూనివర్శిటీలు తమ క్యాంపస్ లను అమరావతిలో పెడుతున్నాయి. టోక్యో యూనివర్శిటీ కూడా ఈ జాబితాలో ఉంది. విద్యాపరంగా అంతర్జాతీయ స్కూల్స్ అన్నీ తమ క్యాంపస్‌లను నిర్మిస్తున్నాయి. ఇకవైద్య పరంగా ప్రపంచప్రఖ్యాత మెడికల్ ఇనిస్టిట్యూట్లు వస్తున్నాయి. జగన్ రెడ్డి నాశనం చేసి పంపించేసిన వాటిలో కొన్ని వెనక్కి రావడానికి..మళ్లీ పెట్టుబడులు పెట్టడానికి సంశయిస్తున్నాయి. ఆతిధ్యం రంగంలో ఉన్న ప్రఖ్యాత సంస్థలన్నీ స్టార్ హోటళ్లు నిర్మిస్తున్నాయి. పదికిపైగా నేషనల్ బ్రాండ్ హోటళ్లు నిర్మాణం జరుపుకుంటున్నాయి. రెండు రోజుల కిందటే మలేషియన్ కంపెనీలు ఎడ్యుకేషన్, టూరిజం, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ రంగంలో పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇక ఐటీ రంగంలో భవిష్యత్ అంతా ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ దే రాజ్యమని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. ఈ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు చంద్రబాబు మొదటగా అడుగు వేశారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 2026 జనవరి నాటికి మొదటి క్వాంటమ్ కంప్యూటర్ సిస్టమ్‌లు ఏర్పాటు చేస్తారు. దిగ్గజ కంపెనీలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి. ఇలా అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ముందడుగు వేస్తోంది. ఐదు సంవత్సరాల పాటు నిరంతరం జరిగిన దాడుల్ని తట్టుకుని అమరావతి ఇప్పుడు ఫీనిక్స్ గా ముందడుగు వేస్తోంది. భవిష్యత్ ఎంతో గొప్పగా ఉండబోతోందన్న సంకేతాలను.. నమ్మకాన్ని, ఆశల్ని ఇస్తోంది.
రాజధానిపై వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రజలదే !
కానీ ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న దౌర్భాగ్యం ఏమిటంటే సొంత రాజధానిపై కుట్రలు చేసే వారు ఎక్కువగా ఉండటం. ఆ రాజధానిని కొంత మందికి పరిమితం చేసి అది మనది కాదని ప్రచారం చేసే వారు ఉండటం. ఇప్పుడు బెంగళూరు కర్ణాటక మొత్తానిదా..అక్కడ ఉండే ప్రజలది మాత్రమేనా?. బెంగళూరు నుంచి వచ్చే ఆదాయంతో రాష్ట్రం మొత్తం సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తున్నారు. హైదరాబాద్ కూడా అంతే. తెలంగాణ కు వచ్చే ఆదాయంలో అరవై శాతం హైదరాబాద్ నుంచి వస్తుంది. అది అక్కడ ఉన్న కొద్ది మందికే చెందుతుందా ?. రాష్ట్ర రాజధాని అంటే అందరిదీ. దాని అర్థం ఎవరైనా అమరావతికి వచ్చి అవకాశాలు పొందవచ్చు. అమరావతి మీద వచ్చే ఆదాయం.. రాష్ట్ర ప్రజలందరికీ చెందుతుంది. ఇది ఒక్క వ్యక్తికి చెందేది కాదు. ఏ ఒక్క వర్గానికీ చెందేది కాదు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్లో ఈ ప్రచారం చేసే వారు ద్వేషించే వర్గానికి చెందిన వారు చాలా పరిమితం. అయినా తప్పుడు ప్రచారాలతో ఇంత కాలం అమరావతిపై కుట్రలు చేశారు. ఇప్పుడు కూడా వాటిని చేసే అవకాశం ఉంది. అందుకే .. మన రాజధానికి మనం మద్దతుగా ఉండాలి. విద్రోహులు చేసే కుట్రలను తిప్పికొట్టాలి. లేకపోతే మన పిల్లల భవిష్యత్ కు మనమే ప్రమాదం తెచ్చిన వాళ్లం అవుతాం. అదృష్టవశాత్తూ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఇలాంటి కుట్రలకు ప్రభావితం కావడం లేదు. అందుకే ఏపీ రాజధాని ఇప్పుడు శూన్యం నుంచి వికసిస్తోంది. ఫీనిక్స్ లా బూడిద నుంచి రెక్కలు విప్పుకుంటోంది. ఇక ఎంత దూరం వెళ్తుందనేది నిబిడాశ్చర్యంతో చూస్తూ ఉండటమే మిగిలింది.