Gurram Paapireddy Movie Review
Telugu360 Rating: 2/5
క్రైమ్ కామెడీ కథ రాయడం ఎంత సులభమో. అంత క్లిష్టతరం. ఎందుకంటే మన చుట్టూనే ఎన్నో నేరాలూ, ఘోరాలూ జరుగుతుంటాయి. ఏ పేపర్ తిరగేసినా, టీవీ ఛానల్ ట్యూన్ చేసినా వెరైటీ క్రైమ్ ఏదో కంట పడుతూనే ఉంటుంది. కాకపోతే ఆ క్రైమ్ ని ఎంత ఆసక్తిగా చెబుతున్నాం, కామెడీని ఎంత సహజంగా బిల్డ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. ఈ విషయంలో తేడా జరిగితే… సినిమా తీయడమే పెద్ద క్రైమ్ గా, ఆ ప్రయత్నం కామెడీగా మారిపోయే ప్రమాదం ఉంది. స్మశానంలో శవాల్ని తవ్వి, ఎత్తుకుపోయే ఓ బ్యాచ్ కథతో తీసిన సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. స్మశానంలో శవాలతో ఏం చేస్తారు? అనే పాయింట్ ఆసక్తి కలిగించేదే. అయితే ఈ పాయింట్ ని ఆసక్తిగా మలిచారా, ఇందులో కామెడీ ఎంత నవ్వించింది?
గుర్రం పాపిరెడ్డి (నరేష్ ఆగస్త్య) ఓ క్రైమ్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. ఈ క్రైమ్ లో తన పార్టనర్ సౌదామిని (ఫరియా అబ్దుల్లా). వీరిద్దరూ కలిసి గొయ్యి (జీవన్), మిలటరీ (కసి రెడ్డి), చిలిపి (వంశీధర్ గౌడ్) అనే ముగ్గురి సహాయం తీసుకొంటారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న స్మశానంలోంచి ఓ శవాన్ని తీసుకొని శ్రీశైలం స్మశానంలో పాతి పెట్టాలి. ఇదీ ప్లాను. ఈ ప్రయాణంలో ఈ ఐదుగురికీ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అసలు ఈ శవాల మార్పిడి కార్యక్రమం ఎందుకు మొదలెట్టారు? వీటి వెనుక ఉన్న కథేమిటి? దీనికీ కళింగ సంస్థానానికీ ఉన్న లింకేమిటి? అనే విషయాలు తెరపై చూడాలి.
పాయింట్ పరంగా క్రేజీగా ఆలోచించిన సినిమా ఇది. సెటప్ పరంగానూ కొత్తగా అనిపించింది. శవాల్ని దొంగతనం చేయడం అనేది కచ్చితంగా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అందుకోసం ఓ ముగ్గురు స్టుపిడ్స్ సహాయం తీసుకోవడం, దాని వెనుక `కోడి బుర్ర` రీజనింగ్ చెప్పడం ఇదంతా బాగుంది. అయితే ఇలాంటి సెటప్పులో ఉండాల్సిన కామెడీ, థ్రిల్స్ ఎందుకో మిస్సయ్యాయి. కోర్ట్ రూమ్‌లో జడ్జి స్థానంలో ఉన్న బ్రహ్మానందం పాత్రల్ని పరిచయం చేస్తుండడంతో ఈ కథ మొదలవుతుంది. బ్రహ్మానందం మాటి మాటికీ ‘స్టుపిడిటీ… స్టుపిడిటీ’ అనే డైలాగ్ వల్లిస్తుంటారు. ఈ కథలో, కథనంలో అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తన ఉపోద్ఘాతానికి ముక్తాయింపు ఇస్తూ `ఇదో గతి తప్పిన కథ` అన్నచోటే సినిమా మొదలవుతుంది. ఆ తరవాత కథ తీరుతెన్నులు కూడా అలానే ఉన్నాయి.
గోల్డ్ షాప్ దొంగతనంతో ఈ కథని మొదలెట్టారు. దాదాపుగా ప్రధాన పాత్రలన్నీ అక్కడే పరిచయం అవుతాయి. ఏ పాత్ర ఎలా బిహేవ్ చేయబోతోందన్న విషయంలో అక్కడే ఓ క్లారిటీ వస్తుంది. గోల్డ్ షాప్ దొంగతనం సీన్ సిల్లీగా అనిపిస్తుంది. అక్కడ దర్శకుడి తాలుకూ తెలివితేటలు ఏం కనిపించలేదు. అయితే ఆ తరవాత సాగిన శవాల దొంగతనం సీన్ మాత్రం సరదాగా ఉంటుంది. అక్కడ పాత్రల మధ్య ఎదురయ్యే గందరగోళం, మిలట్రీని గోతిలో కప్పేయ్యడం నవ్వులు పంచుతాయి. ఆ తరవాత అసలు కథ మొదలవుతుంది. ఈ శవాల మార్పిడి వెనుక ఉన్న అసలైన డ్రామా బయటపడుతుంది. కళింగ సంస్థానంతో ఈ కథకు లింకు అర్థం అవుతుంది. ఓ శవ మార్పిడి వెనుక వేల కోట్లు ఉన్నాయన్న విషయం ఆసక్తిని కలిగిస్తుంది. గొయ్యిని కళింగ వారసుడిగా కోర్టు మెట్లు ఎక్కిండం, ఆ తరవాత అసలు పాత్రలు రంగ ప్రవేశం చేయడంతో కథనంలో బిగి వస్తుంది. ఇంట్రవెల్ లో కూడా ఓ ట్విస్టు వుంది. ఆ సీన్ సుదీర్ఘంగా సాగడంతో కాస్త విసుగు వస్తుంది. కాకపోతే ఇచ్చిన ట్విస్టు వల్ల ద్వితీయార్థం చూడాలన్న ఆసక్తి మొదలవుతుంది.
సెకండాఫ్ దాదాపుగా కోర్టు డ్రామానే. గొయ్యిని కళింగ వారసుడిగా నిరూపించడం చుట్టూనే తిరుగుతుంది. కోర్టులో వాదనలు మరీ సిల్లీగా అనిపిస్తాయి. డీఎన్ఏ టెస్ట్ కోసం జరిగిన ప్రహసనం మరీ సుదీర్ఘంగా అనిపిస్తుంది. తొలి సగంలో అక్కడక్కడ కామెడీ వర్కవుట్ అయ్యింది. సెకండాఫ్‌లో అది కూడా లేదు. సన్నివేశాలు సుదీర్ఘంగా సాగడం, ఒకే పాయింట్ చుట్టూ తిరగడం బోర్ కొట్టిస్తాయి. చివర్లో కూడా ఓ ట్విస్ట్ వుంది. కాకపోతే అప్పటికే ప్రేక్షకుల్లో నీరసం ఆవహిస్తుంది. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చినా.. అది పెద్దగా ఉపయోగపడలేదు.
పోస్టర్‌పై అగస్త్య బొమ్మ కాస్త పెద్దదిగా కనిపిస్తుంది కానీ, కథలో అందరి పాత్రలూ సమానంగానే ఉన్నాయి. చాలా చోట్ల అగస్త్య సైలెంట్ అయిపోయాడు. చివర్లో ఇచ్చిన బిల్డప్ వల్ల, ట్విస్టు వల్ల ఆ పాత్ర హీరోగా రూపాంతరం చెందుతుంది అంతే. ఫరియా పాత్ర లెంగ్త్ పరంగా పెద్దది. కాకపోతే పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. జీవన్, కసిరెడ్డి, వంశీధర్ అక్కడక్కడ మెప్పిస్తారు. బ్రహ్మానందం, యోగిబాబు లాంటి సిద్దహస్తులు ఉన్నా కామెడీ పండలేదు. విలన్ బ్యాచ్ శక్తిమంతంగా లేదు.
హిలేరియస్ ఎపిసోడ్లు రాసుకొనే అవకాశం ఇందులో ఉంది. కానీ దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదు. అక్కడక్కడ తేలికపాటి నవ్వులు మినహా కామెడీ పెద్దగా పిండుకొన్నది లేదు. పాటలు లేకపోవడం రిలీఫ్ ఇచ్చింది. నిర్మాణ విలువలు, దర్శకత్వ ప్రతిభ పెద్దగా కనిపించలేదు.
Telugu360 Rating: 2/5
