అధికారుల్ని అడ్డగోలుగా వాడుకుంటే ఆ పాపం తర్వాత కూడా వెంటాడుతుందని వైసీపీ అధినేత జగన్ కు మరోసారి క్లారిటీ రానుంది. జగన్ తో అత్యంత సన్నిహితంగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్.. టీడీపీ అధికారంలోకి రాగానే వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆరేళ్ల సర్వీస్ వదులుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యారేమో కానీ.. నేరుగా ఏబీఎన్ ఆర్కేతో బిగ్ డిబేట్ కు వచ్చేశారు. ఈ ఆదివారం సాయంత్రం ఆయన సంచలన విషయాలు చెప్పబోతున్నట్లుగా ప్రోమోను రిలీజ్ చేశారు.
ప్రవీణ్ ప్రకాష్ అత్యంత వివాదాస్పదమైన అధికారి. జగన్ ఐదు సంవత్సరాల కాలంలో ఆయన చేసిన నిర్వాకాలపై ఎన్నో విమర్శలు వచ్చాయి. సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆయన కంటే దిగువ స్థానంలో ఉన్న ప్రవీణ్ ప్రకాషే బదిలీ చేశారు. అంతా జగన్ కనుసన్నల్లోనే జరిగింది. విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. జగన్ తో అంట కాగిన పుణ్యంగా.. టీడీపీ అధికారంలోకి రాగానే ఆయన వీఆర్ఎస్కు అప్లయ్ చేశారు. వెంటనే ప్రభుత్వం ఆమోదించింది. తర్వాత ఆయన మనసు మార్చుకుని సర్వీసులో ఉంటానని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని చెబుతున్నారు .
అప్పట్లో ఢిల్లీ వెళ్లిపోయిన ఆయన.. ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు తాను తప్పులుచేశానని అంగీరించేలా.. ఆర్కేకు ఇంటర్యూ ఇచ్చారనేది కీలకం. గత ప్రభుత్వంలో జరిగిన అనేక తప్పుల్ని ఆయన ఈ ఇంటర్యూలో బయటపెట్టారని అంటున్నారు. ఈ ఇంటర్యూ ఓ ఆటంబాంబులా పేలుతుందని వైసీపీ వర్గాలు భయపడుతున్నాయి. అధికారుల్ని నమ్ముకుని జగన్ రెడ్డి చేసిన పాపాలు అన్నీ వరుసగా బయటపడతాయని ఆందోళన చెందుతున్నారు. ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు ఈ ఇంటర్యూ ప్రసారం కానుంది.