భారతి సిమెంట్స్ అక్రమంగా లీజులు పొందినట్లుగా దర్యాప్తులో వెల్లడి అయింది. గనుల శాఖ రిపోర్టు రెడీ చేసింది. ఈ రిపోర్టు ప్రభుత్వానికి చేరగానే లీజులు రద్దు చేస్తారు. అయితే అక్రమాలకు పాల్పడి లీజులు పొందినందుకు ఆ సంస్థపై కేసులు పెట్టాలన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ల్యాప్స్ అయిపోయిన లీజులను అడ్డగోలుగా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవస్థల్ని ఉపయోగించుకుని భారతి సిమెంట్స్ కు కేటాయింపు చేసుకున్నారు. ఏళ్ల తరబడి గనులు దోచుకున్నారు.
ప్రజలు ఇచ్చిన అధికారంతో గనుల దోపిడి
ప్రజలు అధికారం ఇచ్చింది అవినీతికి పాల్పడమని..తమ సొంత సంస్థలకు గనులు, నీరు కేటాయించుకోమని కాదు. కానీ జగన్ రెడ్డి నిర్మోహమాటంగా ప్రజాధనాన్ని, ఆస్తులను కాజేసేవారు. వేల కోట్లు ప్రకటనల పేరుతో తన మీడియాకు తరలించుకుంటారు. వనరుల్ని తన కంపెనీల పేరిట మార్చుకుంటారు. భారతి సిమెంట్స్ విషయంలో అదే జరిగింది. భారతి సిమెంట్స్ అసలు పేరు భారతి సిమెంట్స్ కాదు. రఘురాం సిమెంట్స్. వైఎస్ సీఎం అయ్యాక.. అప్పనంగా వచ్చి పడిన డబ్బులతో.. చాలా తక్కువ రేటుకే ఆ కంపెనీని జగన్ కొనేశారు. తర్వాత భారతి సిమెంట్స్ గా పేరు మార్చుకున్నారు.
అప్పట్లో రఘురాం సిమెంట్స్ కంపెనీకే సున్నపురాయి లీజులు
రఘురాం సిమెంట్స్ కంపెనీ అప్పట్లో సున్నపురాయి లీజులు తీసుకుంది. జగన్ కొనుగోలు చేసి భారతి సిమెంట్స్ గా మార్చారు. భారతి సిమెంట్స్ ఉత్పత్తి ప్రారంభం కాక ముందే 51శాతం వాటాను రెండువేలా కోట్లకు వికాట్ అనే కంపెనీకి అమ్మేశారు. కానీ ఆ కంపెనీ ఎప్పుడూ ఈ భారతి సిమెంట్స్ యాజమాన్యాన్ని చూసుకోలేదు. భారతి రెడ్డే చూసుకుంటూ ఉంటారు. రెండు వేల కోట్లిచ్చిన వికాట్ మాత్రం ఎప్పుడూ కంపెనీ నిర్వహణ పట్టించుకోదు. ఆ రహస్యం ఏమిటో ఎవరికీ తెలియదు.
గనుల లీజులు చట్టపరంగా బదిలీ కావు !
రఘురాం సిమెంట్స్ కు ఉన్న లీజులు భారతి సిమెంట్స్ కు చట్టపరంగా బదిలీ కాలేదు. కేంద్రం గనుల విషయంలో చాలా స్పష్టమైన పాలసీ తీసుకుంది. ఓ కంపెనీ పేరుతో లీజులు తీసుకుని మరొకరు ఆ కంపెనీని టేకోవర్ చేస్తే లీజులు చెల్లవని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దరఖాస్తులు చేసుకుని ఉన్నా సరే.. అవి ల్యాప్స్ అవుతాయని స్పష్టం చేసింది. దీంతో భారతి సిమెంట్స్ లీజులు గందరంగోళంగా పడ్డాయి. 2017లో ఏపీ ప్రభుత్వం రఘురామ్ సిమెంట్స్ కు ఇచ్చిన ప్రాథమిక అనుమతిని రద్దు చేసింది.
అధికారం అండతో అడ్డగోలుగా లీజులు
జగన్ అధికారంలోకి వచ్చాక లీజులను మళ్లీ తన కంపెనీ పేరుతో లీజులను పునరుద్ధరించుకునేందుకు అడ్వకేట్ జనరల్ ను పావుగా వాడుకున్నారు. అసలు విషయాన్ని దాచేసి.. అడ్వాకేట్ జనరల్ నుంచి న్యాయసలహా అంటూ లీజుల్ని పునరుద్ధరించేసుకున్నారు. నిబంధనల ప్రకారం అనుసరించాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అయినా న్యాయసలహా పేరుతో దోచుకున్నారు. ఓడిపోతామని స్పష్టంగా తెలియడంతో ..ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరిలోనే లీజుల్ని పునరుద్ధరిస్తూ జీవోలు జారీ చేశారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు వెళ్లింది. కేంద్రం విచారణ చేయాలని రాష్ట్రానికి లేఖ రాసింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ గుట్టు రట్టు చేసింది. జగన్ రెడ్డి తన లబ్ది కోసం ఇప్పుడు ఓ మాజీ న్యాయమూర్తిని, అడ్వకేట్ జనరల్ ను కూడా వాడేశారు.
నివేదిక రెడీ చేసిన గనుల శాఖ
ఈ మొత్తం అక్రమంపై గనుల శాఖ నివేదిక రెడీ చేసింది. గనుల్ని రద్దు చేయడంతో పాటు తప్పుడు సలహాలు ఓ మాజీ న్యాయమూర్తి, అప్పటి ఏజీ గురించి కూడా కొన్ని వివరాలు పొందుపరిచే అవకాశం ఉంది. ఈ నెలలోనే ఈ గనుల లీజులు రద్దు చేయనున్నారు. కోర్టుకెళ్లినా సరే దొంగలకు ఎలాంటి అవకాశం రాకుండా గట్టి చర్యలు తీసుకోనున్నారు.