లులు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, మాల్స్ విషయంలో వ్యతిరేక ప్రచారానికి మరో చాన్స్ దొరికినట్లయింది. కేబినెట్ సమావేశంలో పవన్ కల్యాణ్ ఏం అడిగారో ఎవరికీ తెలియదు. కానీ బయట మాత్రం ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేసేస్తున్నారు. లులు ను అందుకే జగన్ రెడ్డి దగ్గరకు రానీయలేదని భూములు క్యాన్సిల్ చేసి తరిమేశారని వైసీపీ సోషల్ మీడియా సమర్థించుకుంటుంది. అసలేం జరుగుతుందో తెలియకుండానే.. టీడీపీ సోషల్ మీడియా.. జనసేన కూడా విపరీతంగా స్పందిస్తున్నారు.
లులు గ్రూపు మాల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అవకాశాలు కల్పించింది. మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టనుంది.. అక్కడ గోమాంసం ప్రాసెస్ చేయకూడదని పవన్ స్పష్టం చేశారు. అలాంటి వాటికి అనుమతి ఇవ్వొద్దని అధికారులకు అదే సమావేశంలో సీఎం స్పష్టం చేశారని కూడా తెలిసింది. అయితే లులు గ్రూప్ ఫ్రూట్స్ ప్రాసెసింగ్ కోసమే ప్లాంట్ పెడుతోందని అధికారులు చెప్పారు. ఆ విషయం అంతటితో ముగిసింది. మాల్స్ విషయంలో ఉద్యోగులుగా స్థానికుల్ని నియమించుకునేలా రూల్స్ పెట్టాలని పవన్ కల్యాణ్ కోరినట్లుగా ప్రచారం జరిగింది.
సాధారణంగా మాల్స్ లో పని చేసేది నాన్ స్కిల్డ్ లేబర్. వాళ్లకు లక్షల్లో జీతాలు ఇవ్వరు. ఉన్నత స్థాయిలో అయితే.. లులు తమ ప్రాంతం వారు అని కాక టాలెంట్ నే చూసుకుంటుంది. అందుకే ఈ స్థాయిలో ఉంది. ఇక మాల్స్ లో పని చేసే చిన్న స్థాయి ఉద్యోగులను కేరళ నుంచి తెచ్చుకోలేరు. అక్కడ యువత ఇలాంటి అవకాశాల కోసం చూడటం లేదు. కావాలంటే వారు గల్ఫ్ కు పోతారు కానీ మాల్స్ లో పని చేసుకోవడానికి ఇతర రాష్ట్రాలకు రారు. ఆ ఉద్యోగాలన్నీ స్థానికులకే వస్తాయి.
లూలు విషయంలో వైసీపీ వ్యతిరేకంగా ఉంది. మొదట్లో ఆ సంస్థ వైసీపీ నిర్వాకానికి మరోసారి ఏపీకి రాబోమని చెప్పింది. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ఎలాగోలా ఒప్పించి పెట్టుబడులు పెడుతుంది. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా.. ఆ సంస్థపై దాడి చేస్తోంది. కేబినెట్ లో జరిగిన చర్చ విషయాలు బయటకు వచ్చాక..వైసీపీ ట్రాప్ లో టీడీపీ, జనసేన సోషల్ మీడియా కూడా పడిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి.