సినిమా నేపథ్యంలో వచ్చే సినిమాలు ఇంకాస్త ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ కూడా అలాంటి సినిమానే. ఆంధ్రా కింగ్ గా ఉపేంద్ర, ఆయన అభిమానిగా రామ్ నటించిన సినిమా ఇది. మహేష్ పి. దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఈరోజు టీజర్ విడుదల చేశారు.
సినిమా కలర్, టోన్, లుక్, కాన్ఫ్లిక్ట్, లుక్.. ఇవన్నీ ఈ టీజర్లో చూపించేశారు. ఓ హీరోని విపరీతంగా అభిమానించే ఓ ఫ్యాన్ కథ. అతను ఆ ఫ్యాన్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్ కూడా. ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి సమస్యని తన సమస్యగా తీసుకొంటాడు. తనని పట్టించుకోని… తన హీరో కోసం ఓ సాహసం చేస్తాడు. ఇవన్నీ ఎలా జరిగాయో తెలియాలంటే ఆంధ్రా కింగ్ తాలుకా లో చూడాల్సిందే. ఫ్యాన్స్ వార్స్, సినిమా థియేటర్ల దగ్గర హంగామా, హీరో – అభిమాని మధ్య వార్… ఇలా వెరైటీ కాన్సెప్ట్స్ తో ఈ సినిమా రూపొందించినట్టు అర్థం అవుతోంది. రామ్ – భాగ్యశ్రీ కెమిస్ట్రీ అదిరింది. వింటేజ్ లుక్ ఈ సినిమాకు ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చింది.
సినిమాలు చూసి ఎవరు చెడిపోతారే…
హాలు ఎవడి తాలుకూ అయినా ఈవేళ దీని మొగుడు మాత్రం ఆంధ్రా కింగ్ తాలుకే..
ఆళ్ల సమస్యని మన సమస్య అనుకోవడమేరా ప్రేమంటే..
ఈడ్ని నైజాంలో కోసేసి, గుంటూరులో కారం పెట్టి, సీడెడ్ లో ఫ్రై చేసి, ఆంధ్రాలో పలావు వండేస్తే… మొత్తం దిగిపోద్ది…
లాంటి డైలాగులు టీజర్లో వినిపించాయి. రామ్ లుక్ బాగుంది. అభిమానులకు నచ్చే కథ కాబట్టి… ప్రతీ అభిమానీ ఈ సినిమాని రిలేట్ చేసుకొనేలా వుంది. నవంబరు 28న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తారు.