నిప్పులేనిదే పొగ రాదని అనుకోవాలన్నట్లుగా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు, ఆయన కుమార్తెల రాజకీయ ఆరంగేట్రంపై చర్చ ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి బదులుగా జగన్మోహన్ రెడ్డి కుమార్తెల్లో ఒకరిని పోటీకి నిలబెట్టే అవకాశం ఉందని కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. వైఎస్ కుమార్తెల గురించి సమాచారం పూర్తిగా ఎప్పుడూ బయటకు రాదు. లోప్రోఫైల్ మెయిన్టెయిన్ చేస్తూంటారు. చదువులు పూర్తి అయినా వారు లండన్లోనే ఉంటున్నారు.
ఎక్కువ సార్లు వారే ఇండియా వస్తూంటారు. పరిమిత సందర్భాల్లో మాత్రం జగన్, భారతి వెళ్తూంటారు. ఇప్పుడు కూడా లండన్ కే వెళ్లారు. పదిహేను రోజుల పాటు యూరప్ లో పర్యటిస్తారు. ఇటీవల షర్మిల కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకు రావాలని నిర్ణయించారు. తనతో పాటు రాజకీయ పర్యటనలకు తీసుకెళ్తున్నారు. రాజారెడ్డి ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని ఆయనే వైఎస్ వారసులని షర్మిల నేరుగా ప్రకటించారు. ఇలాంటి సమయంలో వైఎస్ రాజకీయ వారసత్వంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఈ క్రమంలో తన పిల్లలు రాజకీయంగా వారసత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే రాజకీయాల్లోకి తీసుకు రావాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇంకా బయటకు తెలియలేదు.కానీ రాజకీయంగా తన వారసత్వం ఉండాలని ఆయన కోరుకుంటారనడంలో సందేహం లేదు. అందుకే కుమార్తెల్ని ప్రోత్సహిస్తారని అంటున్నారు.