ఓ సినిమాని ప్రమోట్ చేసుకోవడం చాలా చాలా అవసరం. మంచి ప్రాజెక్ట్ తీయడమే కాదు. జనాల్లోకి వెళ్లేలా చూసుకోవాలి. ఈ విషయంలో కొంతమంది హీరోలు చాలా అప్రమత్తతో వ్యవహరిస్తుంటారు. ఈ జనరేషన్లో సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో నాని ముందు వరుసలో ఉంటాడు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా అదే చేస్తున్నాడు. తన సినిమాలన్నీ తానే స్వయంగా ప్రమోట్ చేసుకొంటుంటాడు. నిర్మాతలతో సంబంధం లేదు. తనకంటూ ఓ రోడ్ మ్యాప్ ఉంటుంది. ‘క’ సినిమాని తాను చాలా గట్టిగా ప్రమోట్ చేశాడు. తగిన ఫలితం కూడా వచ్చింది. ఇప్పుడు ‘కె.ర్యాంప్’ని కూడా అలానే ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఇంటర్వ్యూల ఘట్టం పూర్తి చేశాడు. ట్రైలర్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఇప్పుడు గ్రౌండ్ లెవల్ ప్రమోషన్ మొదలు పెట్టాడు. సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీకి వెళ్లాడు. రాజమండ్రి రౌండ్ వేశాడు. 15న ప్రీ రిలీజ్ ఫంక్షన్ వుంది. 17న మరో ప్రెస్ మీట్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఈమధ్యలో మీమర్స్ ని కూడా మీట్ అవుతున్నాడు.
ఈ దీపావళికి గట్టి కాంపిటీషన్ వుంది. ముఖ్యంగా ‘కె.ర్యాంప్’, ‘డ్యూడ్’ సినిమాల మధ్య పోటీ వుంది. ఇవి రెండూ యూత్ కథలే. కాబట్టి యూత్ ని థియేటర్లలోకి ఆకర్షించడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు మొదలెట్టారు. ‘డ్యూడ్’ తో పోలిస్తే… ‘కె.ర్యాంప్’ ప్రమోషన్లు జోరుగా ఉన్నాయి. దానికి కారణం కిరణ్ దూకుడే. ‘క’తో సక్సెస్ రూట్ లోకి వచ్చిన కిరణ్.. దాన్ని కాపాడుకోవాలంటే మరో హిట్టు కొట్టడం చాలా అవసరం. పైగా `కె.ర్యాంప్` తన బ్యానర్లో చేద్దామనుకొన్నాడు. ఈ కథతో అంత కనెక్ట్ అయ్యాడు. ‘క’ సక్సెస్ తో వరుసగా 5 కథలు ఓకే చెప్పాడు. మరో హిట్టు పడితే… తన కెరీర్ ఎలా ఉంటుందో తనకు తెలుసు. కాబట్టి.. తానొక్కడే ప్రమోషన్లు చేసుకొంటున్నాడు. ప్రమోషన్ల వల్లే సినిమాలు ఆడవు. కాకపోతే.. సినిమా చూడాలన్న ఉత్సాహం, ఆలోచన ప్రేక్షకుల్లో కలుగుతాయి. వాటి కోసమే కిరణ్ ఇంత కష్టపడుతున్నాడు. తన కష్టానికి ఎలాంటి ఫలితం వస్తుందో తెలియాలంటే 18న ఓపెనింగ్స్ ఫిగర్స్ చూడాలి.