హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని అక్కడి నేతలు డిమాండ్ ప్రారంభించారు. ఆయన ప్రస్తుతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు చోట్ల బాలకృష్ణను మంత్రిని చేయాలన్న ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు చేశారు. గతంలో ఇలా ఉండేది కాదు. ఎవరూ బాలకృష్ణ మంత్రి పదవి గురించి చర్చించేవారు కాదు. కొత్తగా ఇప్పుడు ఈ డిమాండ్ ను తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.
బాలకృష్ణ సహజంగా ఇలాంటి డిమాండ్లకు వ్యతిరేకం. ఆయనకు తెలిసి కార్యకర్తలు ఇలా చేయరు. ఇలాంటి డిమాండ్లు చేసిన వారితో కూడా బాలకృష్ణ సున్నితంగానే స్పందించారు. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది కదా ఇంకేం కావాలని ప్రశ్నించారు. మంత్రి పదవి విషయంలో తనదేంలేదని.. ఆయన స్పష్టం చేశారు. అంటే మంత్రి పదవి కావాలని కానీ.. వద్దని కానీ బాలకృష్ణ అభిప్రాయంతో లేరు. పార్టీ వెసులుబాటును బట్టి అవకాశం ఇవ్వాలనుకుంటే ఆయన తీసుకుంటారని అనుకోవచ్చు.
నిజానికి బాలకృష్ణకు కూడా మంత్రి పదవిపై అంత ఆసక్తి ఉన్నట్లుగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు. కెరీర్ ప్రారంభించి దశాబ్దాలు గడుస్తున్నా ఆయన సినీ కెరీర్ ను అత్యంత శ్రద్ధతో కొనసాగిస్తూ ఉంటారు. ఓ రకంగా రాజకీయాల కన్నా సినిమాలపైనే ఆయనకు ఎక్కువ ఆసక్తి. అదే సమయంలో కుటుంబం నుంచి ఇప్పటికే నారాలోకేశ్ మంత్రిగా ఉన్నారు. మరో అల్లుడు విశాఖ ఎంపీగా ఉన్నారు. అందుకే మంత్రి పదవిపై పెద్దగా అంచనాలు కూడా పెట్టుకోవడం లేదని టీడీపీ వర్గాలంటున్నాయి.
గతంలో వైసీపీ నేతలే బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడం లేదు పాపం అని జాలి చూపించేవారు. అలా మాట్లాడేవారిని చూసి బాలకృష్ణ జాలిపడేవారు. ఇప్పుడు హిందూపురం కార్యకర్తలను ఇలా బాలకృష్ణ మంత్రి పదవి కోసం ఎవరు మోటివేట్ చేశారో కానీ.. కొత్తగా చర్చను అయితే ప్రారంభింపచేశారు.