అడవిలో అన్నలు బయటకు వస్తున్నారు. పోలీసు ఎదుట లొంగిపోతున్నారు. ఆయుధాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇక ప్రశాంతంగా జన జీవన స్రవంతిలో గడపాలనుకుంటున్నారు. లేకపోతే మార్చి నెలాఖరులోపు తూటాలకు బలి కావడం తధ్యమని వారికి స్పష్టత ఉంది. ఈ వాస్తవాన్ని వారు గుర్తించారు. అయితే నక్సలైట్లకు ఫ్యాన్స్ అని.. ఎర్రజెండాకు బానిసలమని చెప్పుకుని ఇంకా అడవుల్లోకి పోకుండా సోషల్ మీడియాలో ఉండే కొంత మంది మాత్రం ఆ లొంగిపోయేవారిని బెదిరిస్తున్నారు. కించపరుస్తున్నారు. అవమానిస్తున్నారు. ఈ అర్బన్ నక్సల్స్ కూ ఓ సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది.
అడవుల్లో ఉండి సాధించేదేమీ లేదు !
మావోయిస్టులు అత్యధిక మంది లొంగిపోతున్నారు. కొంత మంది మిగిలిపోయారు. వారిలో చాలా మంది లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి. సరైన దారి కోసం చూస్తున్నారు. ఇక లొంగిపోయేది లేదనుకున్నవారిని నిర్మోహమాటంగా తుదముట్టిస్తామని ఇప్పటికే హెచ్చరికలు ఉన్నాయి. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ తో అడవుల్లో ఉండి.. గిరిజనుల్ని అడ్డం పెట్టుకుని ఏదో విప్లవం తెస్తామని నక్సలైట్లు ఇప్పటి వరకూ అనుకున్నారు. ఒకప్పుడు అది ఎంతో కొంత సాధ్యమయింది కానీ ఇప్పుడు అసలు అవకాశమే లేదు. ఆ విషయం మెల్లగా నక్సలైట్ క్యాడర్ కు అర్థమవుతోంది. చావడం కన్నా.. బతకడం మంచిదని బయటకు వస్తున్నారు. ఇప్పుడు అడవుల్లో కాదు.. గుహల్లో దాక్కున్నా సరే కనిపెట్టే టెక్నాలజీ వచ్చాక.. ఆజ్ఞాతంలో ఉండి యుద్ధం చేయగలమన్నది అవివేకం. దాన్ని కొత్త తరం గుర్తించింది. పాత తరానికి అవగాహన వచ్చింది.
నక్సలైట్లకు స్పష్టత – మార్చి నెలాఖరుకు మిషన్ కంప్లీట్
నక్సలైట్లు ఎంత మంది ఉన్నారు.. వారు ఎక్కడెక్కడ ఉన్నారన్నది కేంద్ర ప్రభుత్వం వద్ద లెక్క ఉంది. అందరికీ ఓ చాన్స్ ఇచ్చింది. అగ్రనేతలు వరుసగా లొంగిపోవడానికి కారణం ఇదే. ఆయుధాలతో సహా లొంగిపోతున్న వారికి సాయం చేస్తున్నారు. కానీ వారిపై నిఘా ఉంటుంది. వారు ఉద్యమం పేరుతో చేసిన ఘోరాలపై చర్యలు ఉండకపోవచ్చుకానీ బయటకు వచ్చాక తప్పులు చేస్తే మాత్రం .. కేసులు ఉండవని అనుకోలేరు. ఆ నిఘా .. నీడ వారిని వెంటాడుతూనే ఉంటుంది. బయటకు రాని వారి గురించి మార్చి నెలాఖరు తర్వాత చెప్పుకోవాల్సింది ఏమీ ఉండదు.
లొంగిపోతున్న వారిపై అర్బన్ నక్సల్స్ అసహనం
విచిత్రంగా అడవుల్లో ఉండి పోరాడేవారు లొంగిపోతూంటే.. కొంత మంది సోషల్ మీడియాలో.. యూట్యూబ్ ఛానళ్లలో విమర్శలు చేస్తున్నారు. ఆయుధాలతో సహా లొంగిపోవడం ఎర్రజెండాకు అవమానమని.. తగిన ఫలితం అనుభవిస్తారని హెచ్చరిస్తున్నారు. వీళ్లుఎవరూ అడవుల్లోకి వెళ్లలేదు. వెళ్లిన వాళ్లకు ఏమైనా చేశారో .. లేకపోతే వారికి ఇక్కడ అధికార ప్రతినిధులుగా ఉన్నారో ఎవరికీ తెలియదు.కానీ ఈ సానుభూతిపరులంతా బయటే తిరుగుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి వారు ఇంకా భ్రమల్లోనే ఉన్నారని సులువుగా అర్థమైపోతుంది. వారి సంగతి కూడా తర్వాత చూస్తారేమో ?