వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము చేసే రాజకీయం తమ కొంపకే నిప్పు పెడుతుందని తెలిసినా కూడా అదే రాజకీయం చేస్తుంది. పాలన ఎలా చేయకూడదో ఎంతో మంది చెప్పినాసరే అలాగే చేశారు. చివరికి ప్రజలు ఇచ్చిన అధికారంతో ఒక్క సారి అయినా చంద్రబాబును అరెస్టు చేయకపోతే తాము ఎందుకని.. వ్యవస్థల్ని అడ్డగోలుగా వాడుకుని మరీ తమ కోరిక తీర్చుకున్నారు.కానీ ఏమైంది.. తమ ఇల్లు తగలబడిందని ఎన్నికల ఫలితాలువచ్చే వరకూ తెలియలేదు. పోనీ ఇప్పుడైనా తగలబడిపోయిన ఇంటిని కాస్త జాగ్రత్తగా కట్టుకుందామని అనుకుంటున్నారా అంటే… తగలబడిపోయిన ఆ బూడిదను తీసుకెళ్లి మురికి కాలువలో పడేసుకుంటున్న వ్యూహాలు అమలు చేస్తున్నారు.
వైసీపీని కాల్చేస్తున్న కుల రాజకీయాలు
రాష్ట్రంలో కుల రాజకీయాలు చేద్దామని జగన్ రెడ్డి ఆశపడుతున్నారు. అందుకే ఏం జరిగినా.. ఆ ఘటనల్లో ఇద్దరి కులాలు తీసుకు వచ్చి తన మీడియా,సోషల్ మీడియా ద్వారా పెట్రోల్ పోస్తున్నారు. అయితే తనకు తెలియని విషయం ఏమిటంటే ఆ మంటలు తనను , మిగిలి ఉన్న తన పార్టీని దహిస్తాయనే. ఇప్పటి వరకూ తమకు జరిగిందే. కులాల ప్రకారమే రాజకీయాలు చేశారు. కులాల ప్రకారమే పథకాలు ఇచ్చారు. కులాల ప్రకారమే పార్టీ నేతల్ని ప్రోత్సహించారు. కానీ ఏ కులమూ ఎందుకు మద్దతివ్వలేదో అర్థం చేసుకోలేకపోయారు.
అన్ని కులాలూ వ్యతిరేకమయ్యాయి కదా ..అయినా తెలుసుకోలేరా?
జగన్ రెడ్డి సొంత సామాజికవర్గం కూడా ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఎందుకంటే ఇలాంటి రాజకీయాల వల్లనే. ఎప్పుడైనా పూర్తిగా ఇరువురి మధ్య గొడవలు పెడితే.. ఓ వర్గం మాకు అండగా ఉంటుందని అనుకునే వ్యూహం ఎంత ఘోరంగా ఫెయిలవుతుందో జగన్ రెడ్డి అనుభవించారు. కానీ మొదటికే మోసం వచ్చింది. అయినాఇప్పుడు అదే వ్యూహాన్ని అవలభిస్తున్నారు. ఏపీ ఇప్పుడు కోలుకుంటోంది. పెట్టుబడులు,ఉద్యోగాలు పేరుతో దేశవ్యాప్తంగా హైలెట్ అవుతోంది. ఇలాంటి సమయంలో రచ్చ చేయడానికి కుల వ్యూహాన్ని జగన్ రెడ్డి పాటిస్తున్నారు.
అన్ని కులాల వారికీ రాజకీయ చైతన్యం
ఏపీలో కీలకంగా ఉండే ప్రతి సామాజికవర్గం ఇప్పుడు రాజకీయ చైతన్యంతో ఉన్నారు. వైసీపీ నేరేటివ్స్ కు పడిపోయి..వారితో కలిసిపోయే పరిస్థితుల్లో లేరు. జగన్ రెడ్డి నిర్వాకాలు అందరూ చూసేశారు. ఆయన వాడకం కూడా చూసేశారు. అందుకే ఇప్పుడు ఎవరూ ఆ కుట్రల్లో భాగమయ్యే పరిస్థితి లేదు. తాము ఏం చెప్పినా నమ్మేసే గొర్రెలు ఉన్నారని అడ్డగోలు రాజకీయాలు చేయవచ్చు కానీ.. నిజాలు తెలిసిన రోజున ఆ గొర్రెలు కూడా పారిపోతాయి. ఇప్పుడు వైసీపీలో అదే జరుగుతోంది. వైసీపీని నమ్మే గొర్రెలు కూడా తగ్గిపోతున్నాయి.