నవీన్ పొలిశెట్టి స్టైల్ పూర్తిగా వేరు. తన సినిమాల్లోనే కాదు. ప్రమోషన్స్ లోనూ కామెడీ ఉంటుంది. తన టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషన్ కంటెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తన కొత్త సినిమా ‘అనగనగా ఒక రాజు’ ప్రమోషన్లు కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి వస్తున్న సంగతి తెలిసిందే. ఈలోగానే ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాడు. ఈరోజు దీపావళి కదా.. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది చిత్రబృందం. అందులో పొలిశెట్టి మార్క్ పటాకులు బాగా పేలాయి. ఎలాన్ మాస్క్ నుంచి నాగవంశీ వరకూ అందర్నీ వాడేశాడు ఈ గ్లింప్స్.
‘ఈ బాంబు అంటించి పారిపోండి. దగ్గరున్నారంటే ముఖం మీద పేలుతుంది’ అంటూ నాగవంశీ ఫొటోని చూపించడం.. ఈ గ్లింప్స్ లోని హైలెట్. ఇండియా – పాకిస్థాన్ వార్లో వాడినవన్నీ మనం సప్లై చేసిన బాంబులే అంటూ కోసిన కోతలు కూడా నవ్వించాయి. ‘దీవాళికి వెలిగిస్తే సంక్రాంతి పండగ వరకూ పేలుతూనే ఉంటాయి’ అంటూ చివరిగా ‘అనగనగా ఒకరాజు’ బ్లాస్ట్ ని పరిచయం చేశాడు పొలిశెట్టి.
నవీన్ పొలిశెట్టి సినిమాలంటేనే వన్ మాన్ షో. సినిమా మొత్తం తానే కనిపిస్తాడు. ఈ దివాళీ స్పెషల్ వీడియోలో కూడా అంతే. మొత్తం అంతా తానై నడిపించేశాడు. వన్ మ్యాన్ షోలా. మొత్తానికి ఈ నవ్వుల పటాకా బాగా పేలింది. ఈ దివాళీకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో ఇదే బెస్ట్ అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. ఈ జోష్ సినిమాలో కూడా ఉంటే.. ఈ సంక్రాంతికి కూడా నవీన్ బ్లాస్ట్ ఇవ్వడం ఖాయం.