భీమవరం డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి హోం మంత్రికి ఫిర్యాదు చేశారు. స్వయంగా పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారంటే.. ఆయనకు ఖచ్చితంగా సమాచారం వచ్చి ఉంటుందని అనుకోవచ్చు.
జయసూర్య వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుందని భీమవరం రాజకీయ నేతలు చెబుతూ ఉంటారు. గతంలో గన్నవరం డీఎస్పీగా పని చేశారు. ఆ సమయంలో వైసీపీ కోసం ఆయన విధేయత చూపించారు. తరవాత కొంత మంది నేతలతో చెప్పించుకుని భీమవరంలో పోస్టింగ్ పొందారు. జనసేన పార్టీ నేతలతో ముఖ్యంగా ఎమ్మెల్యే అంజిబాబుతో సన్నిహితంగా ఉంటారు. ఆయన చెప్పినట్లుగా చేస్తున్నట్లుగానే ఉంటారు.. ఆ సాన్నిహిత్యంతో తన దందాలు తాను చేసుకుని అక్రమ వ్యవహారాలకు అండగా నిలుస్తున్నారని అంటున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పవన్ కల్యాణ్ స్పందించారు.
పవన్ కల్యాణ్ అప్పటికి పూర్తి సమాచారం తెప్పించుకున్న తర్వాతనే ..జయసూర్య అంశంపై డీజీపీకి, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారని చెబుతున్నారు. పూర్తిగా జనసేన పార్టీతో అసోసియేట్ అయినట్లుగా వ్యవహరిస్తూ అడ్డగోలు పనులు చేయడమే.. పవన్ కల్యాణ్‌కు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. పవన్ ఆగ్రహంతో ఆయనను.. బదిలీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి డీఎస్పీల లెక్క తీయాలన్న అభిప్రాయం అన్ని పార్టీల్లో వినిపిస్తోంది.