భారత రాష్ట్ర సమితి పూర్తిగా దారి తప్పిందని తాను తెలంగాణ వాదానికి వారసురాలినని కవిత నిరూపించాలని డిసైడ్ అయ్యారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తన జాగృతిని పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేసుకున్నారు. ఊరూరా కార్యకర్తల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఆదరణ దొరకని చోటా, మోటా నేతలంతా కవిత వద్దకు వస్తున్నారు. తమకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. కవిత అందర్నీ ఆదరిస్తున్నారు. అదే సమయంలో ఆమె పార్టీకి ఆత్మ చాలా ముఖ్యమని..ఆ ఆత్మ తెలంగాణనే అని .. దాన్ని ఓన్ చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
తెలంగాణ ఉద్యమకారులతో నిరంతర చర్చలు
తెలంగాణ ఉద్యమం సమయంలో కవిత కీలకంగా వ్యవహరించారు. జాగృతి వ్యవహారాలతోపాటు ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. అందుకే ఉద్యమకారులతో మంచి పరిచయాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ వర్గాల ఉద్యమకారులు .. పెద్దగా బయట కనిపించడం లేదు. వారికేమీ గుర్తింపు రాలేదు. అందుకే కవిత అలాంటి వారిని ఇప్పుడు తన పార్టీ తరపున గుర్తించి.. వారిని గౌరవిస్తున్నారు. గుర్తింపు లేని మేధావులుగా పేరు పడిన వారందరితో చర్చలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మేధావులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ కేంద్రంగా పార్టీ పాలసీని సిద్ధం చేసుకుంటున్నారు.
జనంబాటలో తెలంగాణ సెంటిమెంట్ ప్రకటనలు
కవిత ఈనెల 25న నుంచి జాగృతి జనంబాట కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ ప్రచారంలో తెలంగాణ కోసం ఎలాంటి అంశాలను లేవనెత్తాలన్న అంశంపై మేధావులను కలిసి వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, క్షేత్రస్థాయి సమస్యలు, ఇతర సమస్యల పై చర్చిస్తున్నారు. తెలంగాణ వాదం అంటే.. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం. పొరుగు రాష్ట్రాల దోపిడీని వ్యతిరేకించడం అని కవిత.. బీఆర్ఎస్ ఆ ప్రకారం చూస్తే.. కర్ణాటక, ఏపీపై కవిత విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తరహా దూకుడును ఆమె చూపించాలని అనుకుంటున్నారు.
పదే పదే ఆ ఆయుధం ఉపయోగపడుతుందా?
ప్రజల్లో ఉన్న ప్రత్యేక రాష్ట్ర భావనను కేసీఆర్ పక్కాగా అందిపుచ్చుకుని…తెలంగాణ వాదంతో అనుకున్న విజయాలు సాధించారు. కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్లు ఉన్నాయా లేదా అన్నదే రాజకీయవర్గాలకు సందేహం. సొంత రాష్ట్రంలో ఉన్న ప్రజలను.. తెలంగాణ వాదం పేరుతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే వర్కవుట్ కాదని కొంత మంది అంటున్నారు. రాజకీయాల్లో ఏ ఆయుధం అయినా ఒక్కసారే పని చేస్తుందని.. పదే పదే వర్కవుట్ కాదని అంటున్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత ప్రయత్నించినా వర్కవుట్లు కాలేదని అంటున్నారు. ఇటీవల మళ్లీ బీఆర్ఎస్ కూడా తెలంగాణ వాదమే గట్టిగా వినిపిస్తోంది.కానీ అనుకున్నంతగా సక్సెస్ కావడం లేదు. కవిత .. నిజంగా తెలంగాణ వాదంతోనే జాగృతి రాజకీయం చేస్తే.. అది ఫెయిల్డ్ పాలసీ అవుతుదంని బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా లైట్ తీసుకుంటున్నారు.