వైసీపీలో ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డి బెటరా.. సజ్జల రామకృష్ణారెడ్డినా అని. 90 శాతం క్యాడర్ విజయసాయిరెడ్డినే బెటర్ అని అనుకుంటోంది. సజ్జల వల్లే ప్రస్తుతం పార్టీకి ఈ దుస్థితి అని తేల్చేస్తున్నారు. ఇలాంటి సమయంలో విజయసాయిరెడ్డి తాను రాజకీయంగా యాక్టివ్ గా ఉండాలనుకుంటున్నానని ఇతర పార్టీల్లో చేరడం కన్నా జగన్ పక్కన ఉండటానికే ఇష్టపడుతున్నానని నేరుగా చెప్పారు. చాన్స్ లేదంటే ఇతర పార్టీలో చేరిపోవడానికి ఆయన రెడీనే.
వైసీపీ విజయాల వెనుక విజయసాయిరెడ్డి
వైసీపీ ఆవిర్భావం నుండి 2019 మహా విజయం వరకు పార్టీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, అక్కడ విజయసాయిరెడ్డి చాణక్యం స్పష్టంగా కనిపిస్తుంది. జగన్‌తో కలిసి జైలు కష్టాలను అనుభవించడమే కాకుండా, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో బూత్ స్థాయి మేనేజ్మెంట్ నుండి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ వరకు ఒంటి చేత్తో చక్రం తిప్పి జగన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఆ సమయంలో పార్టీలో క్రమశిక్షణ, కార్యకర్తలకు భరోసా ఉండేది.
వైసీపీ పతనానికి కారణం సజ్జల
అధికారం దక్కిన తర్వాత సీన్లోకి ప్రవేశించిన సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీలో అప్పటివరకు ఉన్న సమీకరణాలను పూర్తిగా మార్చేశారు. ఒక పద్ధతి ప్రకారం విజయసాయిరెడ్డి వంటి సీనియర్లను జగన్‌కు దూరం చేస్తూ, తన మాయాజాలంతో జగన్ చుట్టూ ఒక అభేద్యమైన గోడను నిర్మించారు. ఈ కోటరీ రాజకీయాల వల్ల జగన్ ప్రజలకే కాకుండా, తన సొంత కుటుంబానికి, చివరకు నమ్మకమైన కేడర్‌కు కూడా దూరమయ్యారు. చూసి చదవడం తప్ప, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేనంతగా జగన్ ఆత్మవిశ్వాసాన్ని ఈ కోటరీ దెబ్బతీసింది.
త్యాగాలను విస్మరించిన జగన్
ఒకప్పుడు తన కోసం అన్నీ త్యాగం చేసిన విజయసాయిరెడ్డిని సైతం పక్కన పెట్టి, కేవలం సజ్జల మాటలకే జగన్ ప్రాధాన్యత ఇవ్వడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనంగా మారింది. విజయసాయిరెడ్డిపై చుట్టుపక్కల ఉన్న వారు ఏం చెప్పినా నమ్మకూడదు. ఎందుకంటే జగన్ కోసం ఆయన చాలా త్యాగాలు చేశారు. అయినా 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ ఇంకా ఆ సజ్జల మాయ లోనే ఉండటం క్యాడర్ ను ఆవేదనకు గురి చేస్తోంది. పార్టీ పట్టు కోల్పోయి, కేసులు చుట్టుముట్టి, అధికారం పోయినా.. జగన్ ఇంకా వాస్తవాలను గ్రహించలేకపోవడం పట్ల కేడర్ తీవ్ర నిరాశలో ఉంది. జగన్ తన మూర్ఖత్వంతోనే పార్టీని ఈ స్థితికి తెచ్చారని సొంత పార్టీ నేతలే ఇప్పుడు గుసగుసలాడుకుంటున్నారు.
విజయసాయిరెడ్డి ఆఖరి ప్రయత్నం
ఇప్పటికైనా కళ్ళు తెరువు అంటూ విజయసాయిరెడ్డి నేరుగా జగన్‌ను బతిమాలుతున్న తీరు క్యాడర్ ను ఆలోచింప చేస్తోంది. తనను తిరిగి దగ్గరకు తీస్తే కూటమిని విడగొట్టి, పార్టీని గెలిపిస్తానని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు. అయితే, తన చుట్టూ ఉన్న కోటరీని కాదని, మళ్ళీ పాత మిత్రులను జగన్ దగ్గరకు చేర్చుకుంటారా అంటే చాన్సే లేదు అనే సమాధానం వినిపిస్తోంది. జగన్ తన పంథాను మార్చుకోకపోతే, వైసీపీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.
