హైదరాబాద్ మహానగర విస్తరణ వేగంగా జరుగుతున్న తరుణంలో, నగరవాసుల పెట్టుబడి , నివాస ప్రాధాన్యతలు మారుతున్నాయి. ముఖ్యంగా నగరానికి 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ , సంగారెడ్డి పరిసర ప్రాంతాలు ఇప్పుడు వీకెండ్ హోమ్స్, ఫాం ప్లాట్ల కు ప్రధాన కేంద్రాలుగా మారాయి. కాలుష్యానికి దూరంగా, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునే ఐటీ ఉద్యోగులు , రిటైర్డ్ నిపుణులు ఈ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసేందుకు అత్యంత ఆసక్తి చూపుతున్నారు.
గత రెండేళ్లలో వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్ సమీపంలో , సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, నారాయణఖేడ్ పరిసరాల్లో ఫాం ప్లాట్ల విక్రయాలు 40 శాతం వృద్ధిని నమోదు చేశాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రధానంగా మేనేజ్డ్ ఫార్మ్‌ల్యాండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా, భూమి కొనుగోలు చేసిన తర్వాత సదరు సంస్థలే అక్కడ మొక్కల పెంపకం, నిర్వహణ , భద్రతను చూసుకుంటాయి. వారాంతాల్లో కుటుంబంతో కలిసి గడపడానికి చిన్న కాటేజీలు లేదా కంటైనర్ హోమ్స్ నిర్మించుకోవడానికి ఇవి అనువుగా ఉండటంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది.
ఈ ప్రాంతాల్లో భూముల ధరలు అపార్ట్మెంట్లతో పోలిస్తే తక్కువగా ఉండటం , భవిష్యత్తులో రీజినల్ రింగ్ రోడ్ వంటి మౌలిక సదుపాయాల వల్ల అధిక లాభాలు వచ్చే అవకాశం ఉండటం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి కేవలం గంటన్నర ప్రయాణంతో చేరుకోగలిగే వెసులుబాటు ఉండటంతో ఐటీ నిపుణులు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కేవలం భూమి విలువ పెరగడమే కాకుండా, అందులో సాగు చేసే పండ్లు, కూరగాయల ద్వారా సేంద్రీయ ఆహారాన్ని పొందే అవకాశం ఉండటం అదనపు ఆకర్షణగా మారింది.ప్రస్తుతం వికారాబాద్ , సంగారెడ్డి జిల్లాల్లో చదరపు గజం ధర 2,000 నుండి 6,000 మధ్య పలుకుతోందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొనుగోలు చేసే ముందు అన్ని రకాల అనుమతులు ఉన్నాయో లేదో చూసుకోవడం ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
