వెండితెరపై ఒక్కడినే వస్తా.. పక్కాగా కొడతా అని డైలాగులు కొట్టే దళపతి, రాజకీయ తెరపైకి వచ్చేసరికి మాత్రం చివరికి వన్ ప్లస్ ఫోర్‌కి ఫిక్సయిపోయారు. కేవలం 108 సీట్లతో సింగిల్‌గా గర్జించిన సింహం, మేజిక్ ఫిగర్ 118 కోసం కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఇప్పుడు వీసీకే కాళ్ల దగ్గరకు చేరడం చూసి నెటిజన్లు రకరకాల మీమ్స్‌తో ఆడుకుంటున్నారు. తని ఒరువన్ అనుకుంటే.. తీరా చూస్తే అందరి వాడు అయిపోయాడు అంటూ ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
ఎవరితోనూ పొత్తు ఉండదు.. మేమే కింగ్స్ అని కాలర్ ఎగరేసిన టీవీకే శ్రేణులు, ఇప్పుడు తిరుమావళవన్ ఇచ్చే ఒక్క లేఖ కోసం రాజ్‌భవన్ మెట్లపై పడిగాపులు కాయాల్సి వచ్చింది. విజయ్ అన్నా.. సినిమాలో అయితే విలన్లందరినీ కలిపి కొడతావు.. ఇక్కడేమో అందరినీ కలిపి కేబినెట్ అంటున్నావు అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలు కూడా ఇప్పుడు విజయ్‌కు కండిషన్లు పెడుతుంటే, లియో రేంజ్ ఇమేజ్ ఉన్న హీరో కాస్తా రిసార్ట్ పాలిటిక్స్ రేంజ్‌కు పడిపోయారా అని సెటైర్లు వేశారు.
నిన్నటి వరకు డీఎంకేతో అంటకాగిన పార్టీలే ఇప్పుడు విజయ్ చుట్టూ చేరడంతో ఇది విజయ్ మార్క్ ప్రభుత్వమా లేక డీఎంకే వదిలేసిన పాత కూటమి ప్రభుత్వమా అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. ఐదు రోజుల పాటు గవర్నర్ గీసిన గీత దాటలేక, మెజార్టీ కోసం ముక్కుతూ మూలుగుతూ చివరకు 119కి చేరుకున్న ఈ కూటమిని చూసి మద్దతు ఇచ్చే వాళ్లకంటే షరతులు పెట్టే వాళ్లే ఎక్కువయ్యారుగా!” అంటూ ట్విట్టర్లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
తన సినిమాల్లో లాగే పొలిటికల్ ఎంట్రీలోనూ భారీ సస్పెన్స్ డ్రామాను రక్తి కట్టించిన విజయ్, చివరకు ప్యూర్ మెజార్టీ కంటే షేర్డ్ మెజార్టీ కే జై కొట్టారు. సింగిల్ సింహం కాస్తా కూటమి సారథిగా మారడం చూస్తుంటే.. భవిష్యత్తులో ఈ కిచిడీ’ ప్రభుత్వాన్ని నడపడం విజయ్‌కు అసలైన పరీక్ష కానుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
