ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఆయన ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ప్రధాని అధికారిక షెడ్యూల్ లో పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లే కార్యక్రమం లేదు.
మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చే ఆయన సుమారు రూ. 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఇదే సమయంలో ఆయన మాదాపూర్‌లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శిస్తారనే వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఇప్పటివరకు అటు పీఎం నుంచి కానీ, ఇటు జనసేన వర్గాల నుంచి కానీ ఎలాంటి అధికారిక ధ్రువీకరణ రాలేదు.
పవన్ కళ్యాణ్ గారు ఏప్రిల్ 18న ఆపరేషన్ చేయించుకుని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీ స్వయంగా ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్న కారణంగానే ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సుకు కూడా హాజరు కాలేదు. ఇదే తరుణంలో మోదీ హైదరాబాద్‌కు వస్తుండటంతో మోదీ పరామర్శిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ అధికారిక షెడ్యూల్ ప్రకారం ప్రధాని సాయంత్రం నేరుగా గుజరాత్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది.
ప్రస్తుతానికి ప్రధాని పర్యటనలో సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవం , బహిరంగ సభ మాత్రమే ఖరారయ్యాయి. ఒకవేళ చివరి నిమిషంలో ప్రోగ్రామ్ మార్పులు ఉంటే తప్ప, పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.


