తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్న గడ్డుకాలం, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వ సామర్థ్యాలపై కొత్త చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో నారా లోకేష్ ఎన్నో క్లిష్టమైన సవాళ్లు ఎదుర్కొని తనను తాను మలచుకున్న తీరు ఓ కేస్ స్టడీ అవుతుంది. ఆయనను చూసి కేటీఆర్ తన రాజకీయ శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
లోకేష్ ట్రాన్స్ఫార్మేషన్ ఒక పాఠం
నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం ప్రారంభంలో తీవ్రమైన విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. పప్పు అనే ముద్ర నుండి నేడు ప్రతీ దానికి లోకేశ్ కారణం అన్నంతగా ప్రత్యర్థులు కలవరిస్తూ భయపడే స్థాయికి తన ఇమేజ్ మార్చుకున్నారు. తన రూపు రేఖలనే కాదు మాట తీరు సహా , రాజకీయ వ్యూహాల నుండి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం వరకు లోకేష్ ప్రతి అంశాన్ని మార్చుకున్నారు. తండ్రి నీడలో ఉండే నేతగా కాకుండా, సొంత ఇమేజ్ ఉన్న నాయకుడిగా తనను తాను నిరూపించుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అటువంటి ఒక కంప్లీట్ మేకోవర్ దిశగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.
అవకాశాల సృష్టిలో వెనుకబాటు?
కేటీఆర్ అద్భుతమైన వక్త, పరిపాలనా దక్షుడు అనడంలో సందేహం లేదు. కానీ, ఆయనకు రాజకీయ సవాళ్లు ఇప్పటి వరకూ ఎదురు కాలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ అవకాశాలను సృష్టించుకోవడంలో ఆయన తడబడుతున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ ఆయనపైనే భారం వేశారు. కేసీఆర్ నమ్మకాన్ని భర్తీ చేస్తూ, రేవంత్ రెడ్డికి అసలైన సవాల్ కేటీఆరే అనే భావనను ప్రజల్లో కలిగించడంలో ఆయన ఇంకా పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. రేవంత్ రెడ్డి దూకుడును అడ్డుకోవడంలో కేవలం ట్విట్టర్ వేదికగా చేసే విమర్శలు సరిపోవని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మేధావి ముద్ర దాటి సామాన్యుడి చెంతకు
కేటీఆర్‌పై ఇప్పటికీ ఒక రకమైన అర్బన్ లీడర్, హైటెక్ నాయకుడి ముద్ర ఉంది. ఐటీ కారిడార్‌లో ఆయనకు ఉన్న క్రేజ్ గ్రామీణ ప్రాంతాల్లో కనిపించడం లేదనేది చేదు నిజం. నారా లోకేష్ తన పాదయాత్ర ద్వారా పల్లె పల్లెకూ తిరిగి ఎలాగైతే కష్టనష్టాలు తెలుసుకున్నారో, కేటీఆర్ కూడా తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాల్సి ఉంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎదురైన సవాళ్లు వేరు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి పార్టీని కాపాడుకోవడం వేరు. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోతుండటం, కేడర్‌లో నైరాశ్యం పెరగడం వంటి పరిస్థితుల్లో కేటీఆర్ ఒక క్రైసిస్ మేనేజర్ గా మారాలి. నారా లోకేష్ తన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేడర్‌కు ఎలాగైతే భరోసా ఇచ్చారో, కేటీఆర్ కూడా అదే పంథాను అనుసరించాలి. ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే రాజకీయం చేస్తే, అది రేవంత్ రెడ్డి వంటి మాస్ లీడర్‌ను ఎదుర్కోవడానికి సరిపోదు.
నిరంతర మార్పు చాలా ముఖ్యం
రాజకీయం అంటే నిరంతర పరిణామం. కేటీఆర్ తన గత విజయాలను పక్కన పెట్టి, ప్రస్తుత ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవాలి. తనకంటే జూనియర్ అయిన లోకేష్ తనను తాను ఎలా మార్చుకున్నారో గమనించి, ఆ దిశగా అడుగులు వేయాలి. కేసీఆర్ చరిష్మాపైనే ఆధారపడకుండా, తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకోగలిగితేనే బీఆర్ఎస్ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. లేకపోతే రేవంత్ రెడ్డి వంటి దూకుడు ఉన్న నాయకుల ముందు కేటీఆర్ రాజకీయాలు కేవలం చర్చలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.


