మే1న రాబోతున్న సినిమాల్లో ‘గాయపడ్డ సింహం’ ఒకటి. తరుణ్ భాస్కర్ హీరోగా రూపొందించిన ఈ చిత్రంలో జేడీ ప్రధాన పాత్రధారి. శ్రీనివాస్ కాశ్యప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు అతిథి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. శ్రీవిష్ణు పాత్ర దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీవిష్ణు రాకతో ఈ సినిమాకు మరింత బలం వచ్చింది.
అంతే కాదు.. ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయట. అగ్ర హీరోల సినిమాలకు సంబంధించిన రిఫరెన్సులు ఈ సినిమాలో కొన్ని కనిపిస్తాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మహేష్, చరణ్, ప్రభాస్ ల్ని రిలేట్ చేసుకొనే కొన్ని సీన్లు, డైలాగులు ఈ సినిమాలో ఉన్నాయట. మరి ఈ హీరోల్ని ఏ లెవల్ లో వాడారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.
అన్నింటికంటే ముఖ్యంగా ‘దొంగ’ సినిమాలోని గోలీమార్ పాటని ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు. ఈ పాట వాడిన సందర్భం, వాడిన విధానం పర్ఫెక్ట్ గా కుదిరాయని తెలుస్తోంది. ఈ పాట కోసం నిర్మాతలు భారీ మొత్తం ఖర్చు పెట్టినట్టు సమాచారం. రీమిక్స్ చేసినప్పుడు ఆడియో సంస్థకు కొంత మొత్తం చెల్లించాలి. లేదంటే అనుమతులు దొరకవు. అందుకుగానూ నిర్మాతలు బాగానే వెచ్చించారని సమాచారం. దర్శకుడు, హీరో, జేడీ చక్రవర్తి.. వీళ్లంతా చిరుకి అభిమానులే. కాబట్టి.. చిరు పాటని వాడుకొన్నారు. మరి ఈ పాట ఏ మేరకు పేలిందో తెలియాలంటే మే 1 రావాలి.
