వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అత్యంత కీలకమైన పదవిలో కొనసాగిన మాజీ సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సుప్రీంకోర్టులో ఆయనకు ఆశించిన ఊరట లభించకపోవడంతో, ఇక జైలు గడప తొక్కడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పూడి శ్రీహరి .. అధికారం పోయిన తర్వాత కూడా తన ఫేక్ న్యూస్ ను వదల్లేదు. చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి హత్యలు చేశారన్నట్లుగా ఫేక్ గ్రాఫిక్స్ తో ప్రచారం చేస్తున్నారు. దీనిపై నమోదైన కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ లేదా కనీసం అరెస్టు నుంచి మధ్యంతర ఉపశమనం కల్పిం లని ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించడంతో, శ్రీహరి చట్టపరమైన రక్షణ కవచాలన్నీ ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. దీంతో ఆయన అరెస్టుకు మార్గం సుగమమైందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కుప్పం కోర్టు ఇచ్చిన ఊరటపై పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో కుప్పం కోర్టు తీర్పును హైకోర్టు పక్కన పెట్టింది. కానీ మధ్యంతర ఉపశమనం ఇవ్వకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో శ్రీహరి పరిస్థితి’పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు తయారైంది.
ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీహరి ముందున్న దారులు చాలా పరిమితంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించడంతో, ఆయన వెంటనే పోలీసుల ముందు లొంగిపోవడమో లేదా ఏ క్షణమైనా అరెస్టు కావడమో జరుగుతుంది.


