ఎస్.ఎస్.రాజమౌళి ప్రమోషన్ స్ట్రాటజీలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఆయన తీసేది భారీ సినిమా. ఆ సినిమాలో అందరూ స్టార్లే. ఆయన వద్దన్నా ప్రమోషన్లు వచ్చి పడిపోతుంటాయి. కాబట్టి ప్రత్యేకంగా పబ్లిసిటీ కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టరు. బాహుబలి కోసం ఆయన ఒక్క యాడ్ కూడా ఇవ్వలేదు. వెయ్యి కోట్ల సినిమాని ఒక్క వాణిజ్య ప్రకటన కూడా లేకుండా విడుదల చేసిన ఘనత ఆయనకే దక్కుతుందేమో..? ఆర్.ఆర్.ఆర్ కోసం కూడా ఇలాంటి స్ట్రాటజీనే వాడారు. మీడియా ముందుకు పెద్దగా వచ్చింది లేదు. అప్పట్లో ప్రింట్ మీడియాకు తప్ప ఎవ్వరికీ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. ‘ఆర్.ఆర్.ఆర్’కి అయితే అది కూడా లేదు.
ఇప్పుడు బాహుబలి రీ రిలీజ్ చేస్తున్నారు. రెండు భాగాల్ని కలిపి ‘ఎపిక్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టార్గెట్ దాదాపు రూ.100 కోట్లు. రీ రిలీజ్ ద్వారా ఇంత పెద్ద మొత్తం దక్కించుకోవడం నిజంగా చరిత్రే. బాహుబలి ఎపిక్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ కొత్త సినిమాకు జరిగినంత జరిగింది. రీ రిలీజ్ సందర్భంగా ఓ ట్రైలర్ విడుదల చేశారు. ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తారని, మీడియా ముందుకు ప్రభాస్‌ని తీసుకొస్తారని ప్రచారం జరిగింది. అయితే… రాజమౌళి ఈసారి కూడా భిన్నంగానే ఆలోచిస్తున్నారు. ప్రెస్ మీట్ లాంటివేం లేకుండానే రీ రిలీజ్ చేద్దామనుకొంటున్నారు. ఆఖరి క్షణంలో నిర్ణయం మారితే తెలియదు కానీ, ఇప్పటికైతే.. బాహుబలి ఎపిక్ ని సైలెంట్ గానే రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. ఇప్పుడు మాట్లాడినా, మాట్లాడకపోయినా, ప్రమోషన్ చేసినా, చెయ్యకపోయినా… కొత్తగా ఒరిగేదేం ఉండదు. ఇప్పటికే బాహుబలి ఎపిక్ చూడాలని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. నవంబరు లో ఎలాగూ.. మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ఓ ప్రెస్ మీట్ లేదా ఈవెంట్ ఉండబోతోంది. ఈలోగా మళ్లీ మీడియా ముందుకు రావడం ఎందుకు అన్నది రాజమౌళి ఆలోచన.
