ఆలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు.. సినిమా హిట్టవుతుందో, పోతుందో చెప్పడమే కష్టం అనుకొన్న తరుణంలో సీక్వెల్స్ ప్రకటించేసి యవ్వారం ఏమిటో చూద్దామనుకొంటున్నారు మేకర్స్. పార్ట్ 1 అయిపోయింది.. ఇక పార్ట్ 2లో ఇంకా దుమ్ము దులుపుతాం చూడండి అంటూ ఎండ్ కార్డ్స్ లో టైటిల్స్ వేయడం ఈమధ్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. కథని మధ్యలో ఆపేసి ` ఈ సినిమాకి ఇంతే.. కావాలంటే పార్ట్ 2లో చూడండి` అంటూ ఇంటికి పంపించేయడం కూడా నేర్చుకొన్నారీ మధ్య. టాలీవుడ్ లో పేరుకు పేతున్న సీక్వెల్స్ రోజు రోజుకీ ఎక్కువ అయిపోతున్నాయి. పెద్ద హీరో, మీడియం రేంజ్ హీరో అనే తేడా లేదు. టైర్ 1 నుంచి టైర్ 3 వరకూ అందరి సినిమాలకూ ఇదే రోగం పట్టుకొంది.
దేవర 2, సంక్రాంతికి వస్తున్నాం 2, హరి హర వీరమల్లు 2, ఓజీ 2, రాజాసాబ్ 2, కింగ్ డమ్ 2, క 2, స్కంధ 2, దాస్ క దమ్కీ 2. బింబిసార 2, విరూపాక్ష 2, శతమానం భవతి 2, జాంబీ రెడ్డి 2, హనుమాన్ 2, జైలర్ 2, సర్దార్ 2…. ఈ పార్ట్ 2 లిస్టులకు అంతే లేదు. పార్ట్ 3లు కూడా ఉన్నాయి. ఎఫ్ 4, కాంతార 3, కార్తికేయ 3, కేజీఎఫ్ 3, దృశ్యం 3, ఇండియన్ 3, కిక్ 3…. ఈ లిస్టు కూడా ఇప్పట్లో ఆగేది లేదు.
అయితే వీటిలో కొన్ని సీక్వెల్స్‌కి రంగం సిద్దం అవుతున్నాయి. కల్కి 2 ఈనెలలోనే సెట్స్ పైకి వెళ్తోంది. జై హనుమాన్ కథ సిద్ధమైంది. జాంబీరెడ్డి 2 ఈసారి ఇంకా పెద్ద స్థాయిలో తీయబోతున్నారు. జైలర్ 2 కూడా పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది. దేవర 2పై ఆశలు మళ్లీ రేగుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ లేదని అనిల్ రావిపూడి ప్రకటించేశారు. ఎఫ్ 4 కూడా చేసే ఛాన్స్ లేదు. వీరమల్లు, స్కంధ, రాజాసాబ్, దాస్ కా దమ్కీ సీక్వెల్స్ పై ఆశలు వదులుకోవడం మంచిది. ‘ఓజీ 2’ కూడా ఉంటుందో లేదో చెప్పడం కష్టం.
విజయవంతమైన సినిమాలకు సీక్వెల్ తీయడమే ఇబ్బంది అయిపోతున్న తరుణంలో, ఫ్లాప్- యావరేజ్ మార్క్ పొందిన సినిమాలకు కొనసాగింపు ఆశించడం కంటే దారుణం మరోటి ఉండదు. పైగా ప్రేక్షకులు కూడా ఈ గిమ్మిక్కుల్ని నమ్మడం లేదు. సినిమాపై హైప్ పెంచుకోవడానికి దర్శక నిర్మాతలు వేస్తున్న ఎత్తుగడ అనే సంగతి వాళ్లకీ అర్థమైపోయింది. ఇకపై దర్శకులు సీక్వెల్స్ పేరుతో మసి పూసి మారేడు కాయ చేయడం మాని, కథలపై దృష్టి పెట్టడం మంచిది. ఓ సినిమా హిట్టయితే, నిజంగా ఆకథకు సీక్వెల్ చేసే అవకాశం ఉంటే, అప్పుడు ఆ దిశగా ఆలోచించడం మంచిది. అంతే తప్ప.. ముందే సీక్వెల్ కూత కూయడం పరువు పోగొట్టుకోవడం తప్పితే పెద్ద ఉపయోగం ఏమీ ఉండదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
