భారత రాష్ట్ర సమితికి విరాళాలు ఇచ్చే వారు కూడా పూర్తిగా తగ్గిపోయారు. ఆ పార్టీకి అధికారం పోయిన తర్వాత 97 శాతం విరాళాలు తగ్గిపోయాయి. 2024-25లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన విరాళాలు రూ. 15 కోట్లకు కాస్త ఎక్కువ. రెండు ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారారూ. 15 కోట్లు రాగా.. కొంత మంది నేతలు వ్యక్తిగతంగా 9 లక్షలు ఇచ్చారు. ఈ నేతల్లో కూడా ప్రముఖులు ఎవరూ లేరు.
అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి విరాళాలకు కొదవ ఉండేది కాదు. 2023-24లో బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా రూ.580 కోట్ల విరాళాలు వచ్చాయి. కేవలం ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే రూ. 495కోట్లు వచ్చాయి. అంతకు ముందు సంవత్సరం అయితే ఇంకా బీభత్సంగా వచ్చాయి. 2022-23 సంవత్సరంలో రూ.683 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. అప్పట్లో ఎలక్టోరల్ బాండ్లే కాదు.. వివిధ వ్యక్తులు, సంస్థలు కూడా పెద్ద ఎత్తున వచ్చేది.
భారత్ లోని ప్రాంతీయ పార్టీల్లో క్యాష్ రిచ్ పార్టీల్లో బీఆర్ఎస్ పార్టీ ఒకటి. అందుకే ఆ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కేసీఆర్ అనుకున్నారు. చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ ఆర్థిక శక్తి గురించి కూడా ఆయన బహిరంగంగానే చెప్పారు. ఓ సందర్భంలో ప్రత్యేక విమానం కూడా పార్టీకి ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఉందో లేదో స్పష్టత లేదు.
ఇప్పుడు అధికారంలో లేకపవడంతో విరాళాలు ఇచ్చే వారు కూడా కరువయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు అధికార పార్టీలకు .. విరాళాలు వస్తాయన్న టాపిక్ మీద చర్చిస్తే.. భారత రాజకీయాల్లో ఉన్న లొసుగులన్నీ బయటకు వస్తాయి.