జూబ్లిహిల్స్‌లో గెలవడానికి భారత రాష్ట్ర సమితి సింగిల్ లైన్ స్ట్రాటజీ పాటిస్తోంది. అదే కాంగ్రెస్ పై వ్యతిరేక ప్రచారం చేయడం. రాజకీయాల్లో ప్రచారం ముఖ్యం.. నెగెటివా… పాజిటివా అన్నది తర్వాత విషయం. ఈ స్ట్రాటజీ ప్రకారం చూస్తే.. ఇప్పుడు జూబ్లిహిల్స్ లో అటు కాంగ్రెస్ పార్టీ తమ కోసం ప్రచారం చేసుకుంటోది. బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ కోసమే ప్రచారం చేస్తోంది. పూర్తి నెగెటివ్ గా అయినా వారి ప్రచారంలో కాంగ్రెస్ అనే పదమే ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ చుట్టూ జూబ్లిహిల్స్ రాజకీయం జురుగుతున్నట్లుగా అర్థమైపోతుంది.
కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని బీఆర్ఎస్ ప్రచారం
కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ పార్టీపై ఎంత వ్యతిరేకత పెంచితే తమకు అంత లాభమని బీఆర్ఎస్ అనుకుంటోంది. అందుకే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి నెగెటివ్ గా ప్రచారం చేయడానికే ప్రాధాన్యం ఇస్తోంది. కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని.. ప్రజలకు వస్తున్న ప్రతి కష్టానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా వీడియోలు కూడా అదే కోణంలో తీసుకుంటున్నారు. పార్టీ నేతల ప్రచారంలో అదే జరుగుతోంది. ఇదంతా వర్కౌట్ అయి కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగితే.. వారంతా బీఆర్ఎస్కే ఓట్లేస్తారన్న గ్యారంటీ ఏమిటి.. అన్న ప్రశ్న వరకూ బీఆర్ఎస్ రాలేదు. ఎందుకంటే బీజేపీని బీఆర్ఎస్ అసలు పట్టించుకోవడంలేదు.
తమ కోసమే ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్
మరో వైపు కాంగ్రెస్ పార్టీ.. భారత రాష్ట్ర సమితి ప్రస్తావన తీసుకు రావడం చాలా వరకూ తగ్గించింది. తమ కోసమే ప్రచారం చేసుకుంటోంది. తమకు ఓటు వేయాలని అంటోంది. తమ పాలనను చూసి ఓటు వేయాలని అడుగుతున్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గం పూర్తి స్థాయి అర్బన్ నియోజకవర్గం కాబట్టి అక్కడి ప్రజల ప్రయారిటీలు వేరుగా ఉంటాయి. దానికి తగ్గట్లుగానే వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేయడానికి సన్నాహాలు చేుకుంటున్నారు. చివరి రెండు రోజులు రోడ్ షోలు నిర్వహిస్తారు.
బీజేపీ హిందూత్వ ఎజెండాతో కాంగ్రెస్‌కే లాభం
మరో వైపు బీజేపీ కూడా.. ఎన్నికల ప్రచారం చేస్తోంది. కానీ ఆ పార్టీ అత్యధికంగా హిందూత్వ అజెండాను అమలు చేస్తుంది. బండి సంజయ్ బీజేపీ ప్రచారాన్ని లీడ్ చేస్తున్నారు. ఆయన ప్రచార శైలి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన మాటలతో ముస్లిం ఓటర్లు మరింతగా ఏకీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వైపు ఎవరైనా సానుభూతి చూపించినా.. వారు అటు వైపు వెళ్లకుండా.. కాంగ్రెస్ వైపు వెళ్లేలా.. బండి సంజయ్.. రెచ్చగొడుతున్నారని అనుకోవచ్చు. ఇలా.. కాంగ్రెస్ వద్దనుకున్నా.. ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. ప్రచారం ప్రత్యర్థులు ఉండటంతో.. ఆ పార్టీ ఎన్ని తప్పులు చేస్తున్నా కాస్తంత ధీమాగానే కనిపిస్తోంది.
