ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసి ఇప్పటికీ పార్టీలో ధీమాగా ఉన్నా కొండా సురేఖ కుటుంబం తరహాలో ఎవరికీ ప్రివిలేజ్ ఉండదని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. పీసీసీ చీఫ్ గా ఉన్న ఆయన ఇంకెవరైనా అలా మాట్లాడితే సహించేది లేదని.. హెచ్చరించారు. కానీ ఇలాంటి హెచ్చరికలతో ఎవరైనా మాట వినే పరిస్థితి ఉండదు. ఎందుకంటే.. ఒక్కరిపైనా చర్యలు తీసుకునే ప్రయత్నం ఇప్పటి వరకూ కాంగ్రెస్ నాయకత్వం చేయలేదు.
రాజగోపాల్ రెడ్డిని కనీసం హెచ్చరించలేకపోతున్నారే !
తన సోదరుడు మంత్రిగా ఉన్నా.. ఉమ్మడి నల్లగొండ నుంచి ఇద్దరు రెడ్డి మంత్రులు ఉన్నా.. అందులో తన సోదరుడే ఒకరు అయినా.. ఏ మాత్రం కలసి రాని పరిస్థితుల్లో కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తానన్నట్లుగా వ్యవహరిస్తున్న రాజగోపాల్ రెడ్డికి చిన్న హెచ్చరిక జారీ చేయలేకపోతున్నారు. అనిరుధ్ రెడ్డి సహా అనేక మంది ధిక్కరణ వ్యాఖ్యలు చేశారు. ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేపోయారు. ఆ ఫలితమే.. కొండాసురే్ఖ కుమార్తె ధైర్యంగా..సీఎం రేవంత్ పై ఆరోపణలు చేయడానికి కారణం అయింది.
ముఖ్యమంత్రిని అవమానించడమే !
పార్టీ నేతలపై చర్యలు తీసుకోలేకపోవడం అంటే.. చేతకానితనం, నిస్సహాయత మాత్రమే కాదు.. అది ఆరోపణలు ఎదుర్కొన్న ముఖ్యనేతను అవమానించడమే. మాటలు పడిన ఆయనకు ఏం సమాధానం చెబుతారు?. రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్లచోరీ గురించి.. తన అభిప్రాయం చెప్పిన కర్ణాటక మంత్రిని గంటల్లోనే బర్తరఫ్ చేయించారు. రాజీనామా కూడా అడిగేందుకు రాహుల్ ఒప్పుకోలేదు. పదవి నుంచి అవమానకరంగా తప్పించారు.కానీ అదే గౌరవాన్ని తమ పార్టీ ముఖ్యమంత్రులకు ఇచ్చేందుకు ఆ పార్టీ హైకమాండ్ సాహసించడం లేదు.
ఇలా అయితే కాంగ్రెస్ లో ధిక్కార స్వరాలు పెరుగుతూనే ఉంటాయి !
దారి తప్పుతున్న నేతలపై చర్యలు తీసుకోకపోతే.. ధిక్కార స్వరాలు పెరుగుతూనే ఉంటాయి. ఎవర్నీ కంట్రోల్ చేయలేరు. ఒకరిద్దరికి గట్టి షాక్ ఇస్తేనే మిగతా వారు ఆలోచిస్తారు. ఏమీ చేయరు.. హెచ్చరికలు మాత్రమే చేస్తారు అనుకుంటే.. మిగతా రాజకీయ నేతలు.. తాము చేయాలనుకున్నది చేస్తారు.
