గాసిప్స్ టాలీవుడ్ కి కొత్తేం కాదు. హీరో – హీరోయిన్ల మధ్య కాస్త కెమిస్ట్రీ వర్కవుట్ అయితే చాలు. వాళ్ల మధ్య ఏదో ఉందంటూ పుకార్లు పుట్టుకొచ్చేస్తుంటాయి. ఈమధ్య తరుణ్ భాస్కర్ , ఈషారెబ్బాలపై కూడా ఇలాంటి రూమర్లే వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమాలో జంటగా నటించారు. నిజానికి ఈ సినిమాల హీరోయిన్ గా ఈషారెబ్బా పేరుని తరుణ్ భాస్కర్ సూచించాడు. దాంతో… ఇద్దరి మధ్య ఏదో ఉందన్న వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. ‘ఓం శాంతి..’ ఈవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఇద్దరూ మీడియా ముందుకు రావాల్సివచ్చింది. దాంతో.. వారిద్దరి మధ్య రిలేషన్ షిప్ గురించిన ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. అయితే విచిత్రంగా ఇద్దరూ వేర్వేరు రకాలైన ఆన్సర్లు ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు.
ఇండస్ట్రీలో పుకార్లు కామన్ అని, ఏ గాసిప్ అయినా సరే.. పబ్లిసిటీలో భాగమే అంటూ లైట్ తీసుకొంది ఈషారెబ్బా. ఏదోలా వార్తల్లో ఉండాలనుకొనేవాళ్లు పీఆర్‌లతో.. ఇలాంటి స్టంట్లు చేయిస్తూనే ఉంటారన్నట్టు మాట్లాడింది. పెళ్లి వార్తల్ని తాను పెద్దగా పట్టించుకొన్నట్టు కనిపించలేదు. అయితే తరుణ్ భాస్కర్ వెర్షన్ వేరుగా ఉంది. ఇలాంటివి చాలా సున్నితమైన విషయాలని, సరైన సమయం వచ్చినప్పుడు స్పందించాలని, తాను కూడా అలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు.. నిజానికి ఇద్దరి మధ్యా ఏం లేకపోతే.. ‘లేదు..’ అని స్పష్టంగా చెప్పేయొచ్చు. కానీ.. ‘సరైన సమయం రావాలి’ అంటున్నాడంటే ఏదో ఉందనే అర్థం వస్తోంది. మరి ఆ సరైన సమయం ఈ ఇద్దరి విషయంలో ఎప్పుడు వస్తుందో చూడాలి. ఏదేమైనా.. ఈ పెళ్లి వార్త మాత్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ సినిమాకు కావల్సినంత ప్రమోషన్ అయితే తీసుకొస్తోంది. అది చాలు కదా, మేకర్స్‌కి.
