సోషల్ మీడియా, వెబ్ మీడియా బాగా పెరిగిపోయింది. సినిమా స్టార్స్ ఇంటర్వ్యూలపై ప్రత్యేకమైన ఫోకస్ ఏర్పడింది. ప్రతీ సినిమా కోసం హీరో, హీరోయిన్, డైరెక్టర్.. వీళ్లంతా మీడియా ముందుకు వస్తున్నారు. మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఎవరి ఇంటర్వ్యూలు వాళ్లవి. ఇవి కాకుండా కామన్ ఇంటర్వ్యూ సెటప్ వేరు. ఎవరు ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా అదంతా ప్రమోషన్లలో భాగమే. కాకపోతే.. ఈ ఇంటర్వ్యూ సెటప్పులు ఒక్కోసారి లేనిపోని తలనొప్పులకు కారణం అవుతున్నాయి. ప్రశ్నల్లో, సమాధానాల్లో కాంట్రవర్సీలు వెదుక్కొంటున్నారు జనాలు. కొంతమంది కావాలని వివాదాస్పద ప్రశ్నలు అడుగుతున్నారు. కొన్నిసార్లు సెలబ్రెటీలు ఇచ్చిన సమాధానాలు కాంట్రవర్సీలకు కారణం అవుతున్నాయి. దాంతో ముఖాముఖీ కార్యక్రమాలు కాస్త తప్పుదోవ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమపై ఎలాంటి అపప్రద పడకుండా, ఎలాంటి వివాదాల్లోకీ జారిపోకుండా స్టార్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మొదలెడుతున్నారు.
ఆన్ లైన్ సెటప్ లో ఇంటర్వ్యూలు ఇవ్వడం ఈమధ్య ఎక్కువగా కనిపిస్తోంది. దాని ద్వారా.. కెమెరా, ఎడిటింగ్ సెటప్ చిత్రబృందాలే చేస్తున్నాయి. జర్నలిస్టులు వెళ్లి, ప్రశ్నలు అడిగి వచ్చేయడమే. ఆ తరవాత తీరిగ్గా ఎడిట్ చేసి, తమకు కావాల్సిన ప్రశ్నలు – సమాధానాలు మాత్రమే ఉంచి, మిగిలింది ఆయా సంస్థలకు పంపిస్తున్నారు. దాని వల్ల మసాలా ప్రశ్నలు, కాంట్రవర్సీ గోలలూ తగ్గుతాయన్నది వాళ్ల నమ్మకం. ఆదివారం రష్మిక (గాళ్ ఫ్రెండ్) మీడియా ముందుకొచ్చారు. వెబ్ సైట్, ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో వ్యక్తిగత ప్రశ్నల్ని దాదాపుగా పక్కన పెట్టేశారు. ఇంటర్వ్యూ మొదలైనప్పుడే ‘పెళ్లికి సంబంధించిన ప్రశ్నలేం అడగొద్దు’ అని మీడియా ప్రతినిధులకు ముందే చెప్పేశారు. ఒకవేళ అలాంటి ప్రశ్నలు అడిగినా అవి ఎడిట్ అయిపోతాయి. సో.. అడిగినా ఎలాంటి ఇబ్బందీ లేదు. శ్రీలీల ఇంటర్వ్యూలోనూ ఇదే తంతు. తనకు ఇష్టం లేని ప్రశ్నల్ని శ్రీలీల నిరభ్యంతరంగా త్రోసి పుచ్చారు. ఆ ప్రశ్నలన్నింటినీ ఎడిట్ చేసిన తరవాత ఇంటర్వ్యూల్ని బయటకు వదిలారు. వీటివల్ల కాంట్రవర్సీల గోల తప్పుతుంది. తమ సినిమా మాత్రమే ప్రమోట్ అవుతుంది.
కాకపోతే మీడియా ప్రతినిధులు ఈ తరహా ఎడిటెడ్ వెర్షన్ ఇంటర్వ్యూలు చేయడానికి సిద్ధంగా లేరు. ”మా కెమెరాలు మేం తెచ్చుకొంటాం. మా ఎడిటింగ్లు మేం చేసుకొంటాం. అలాగైతేనే ఇంటర్వ్యూలు ఇవ్వండి.. లేదంటే లేదు” అని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. దీనిపై దర్శక నిర్మాతలు ఏమంటారో చూడాలి.
