తిరుమలతిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉండే గోవిందరాజ స్వామి ఆలయంలో 50కిలోల బంగారం గోల్ మాల్ జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనులకు కేటాయించిన బంగారంలో సుమారు *50 కిలోల బంగారం పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
గత ప్రభుత్వ హయాంలో అప్పటి టీటీడీ పాలకమండలి పర్యవేక్షణలో జరిగిన ఈ పనుల్లో నిబంధనలకు విరుద్ధంగా చేశారు. ఈ విమాన గోపురానికి 9 లేయర్స్ బంగారు తాపడం చేయాల్సి ఉంటుంది. కానీ, కేవలం *2 పొరలతోనే పనులను ముగించి, మిగిలిన 7 పొరలకు వాడాల్సిన సుమారు 50 కిలోల బంగారాన్ని కాజేశారు. ఈ మొత్తం వ్యవహారంలో గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు మరియు అప్పటి టీటీడీ ఉన్నతాధికారుల హస్తం ఉందనే అనుమానంతో ప్రభుత్వం లోతైన విచారణకు ఆదేశించింది.
భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన కానుకలు, దాతల సహకారంతో చేపట్టిన ఈ పనుల్లో ఇంతటి మహా పాపం జరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలని హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో విజిలెన్స్ నివేదిక తర్వాత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
