జూబ్లిహిల్స్ ఉపఎన్నికను సీఎం రేవంత్ రెడ్డి ఏ మాత్రం ఆషామాషీగా తీసుకోవడం లేదు. బాధ్యతలు తీసుకున్న పార్టీ నేతలు గట్టిగా పని చేస్తారని అంతా వారికే వదిలేసి తడిగుడ్డేసుకోవచ్చని ఆయన అనుకోవడం లేదు. తాను ముఖ్యమంత్రినని.. ఓ ఉపఎన్నికలో ప్రచారం చేయడం ఏమిటని కూడా అనుకోవడం లేదు. సిటీలో చాలా కొద్ది ప్రాంతంలో ఉండే జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోఆయన ఆరు రోజులు పాటు ప్రచారం చేయాలనుకుంటున్నారు. కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలు, బైక్ ర్యాలీలతో కాంగ్రెస్ అభ్యర్థికి అంతా తానై నడిపించబోతున్నారు.
కేసీఆర్ ప్రచారానికి రారు !
బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, హరీష్ రావు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. రోజుకో స్కీమ్ పెట్టుకుని ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేసేందుకు వారు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ప్రచారానికి రాబోవడం లేదు. ఓ ఉపఎన్నిక ప్రచారానికి తాను ఎందుకుని ఆయన అనుకుంటున్నారో లేకపోతే.. ఫలితం తేడా వస్తే.. కేసీఆర్ క్రేజ్ పూర్తిగా పడిపోయిందని.. అనుకుంటారని వెనుకాడుతున్నారో కానీ.. తెర వెనుక వ్యూహాలకే కేసీఆర్ పరిమితమవుతున్నారు. జూబ్లిహిల్స్ నేతల్ని పిలిపించుకుని.. రౌడీలకు ఓట్లెందుకు వేయకూడదో ప్రజలకు చెప్పాలని దిశానిర్దేశం చేసి పంపించారు. ఇక అదే ఆయన ప్రచారం అనుకోవాలి.కానీ రేవంత్ అలా అనుకోవడం లేదు.
గల్లీ గల్లీలో ప్రచారం చేయనున్న రేవంత్
సీఎం రేవంత్ అక్టోబర్ 30, 31 తేదీలు, నవంబర్ 4, 5 తేదీల్లో మూడు మేజర్ రోడ్ షోలు, ఒక పబ్లిక్ మీటింగ్‌ను ప్రజల మధ్య నిర్వహిస్తారు. అలాగే చివరి రెండు రోజులు కూడా ప్రచారం చేస్తారు. అక్టోబర్ 28న యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్లో తెలుగు సినిమా యూనియన్లతో సమావేశం నిర్వహిస్తారు. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచి చాలా కాలం అయింది. పీజేఆర్ చనిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఆయన కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. మళ్లీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇప్పుడు గెలిచి తీరాలని రేవంత్ గట్టి పట్టుదలగా ఉన్నారు. అందుకే స్థానికుడు.. వ్యక్తిగత బలం ఉన్న నవీన్ యాదవ్ కు పట్టుబట్టి టిక్కెట్ ఇప్పించారు.
సొంత పార్టీలోనూ కోవర్టులున్నారని రేవంత్ అనుమానం
పోల్ మేనేజ్మెంట్ ను కూడా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నరు. మంత్రులు, MPs, MLAs, MLCలు, కార్పొరేషన్ చైర్మన్లకు ప్రత్యేకంగా బాధ్యతలు ఇచ్చారు. పోలింగ్ బూత్‌ల వారగా ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని ఆదేశించారు. ఈ ఉపఎన్నికలో కోవర్టులు కూడా కాంగ్రెస్ ఓటమికి పని చేసే అవకాశాలు ఉన్నాయని రేవంత్ అనుమానిపిస్తున్నారు. రేవంత్ పై వ్యతిరేకత పెరిగిందని ప్రచారం చేసేందుకు ఈ ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఓడించడానికి కొంత మంది గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అనుమానసి్తున్నారు. వారికి చాన్స్ ఇవ్వకుండా.. తన బలంగానే రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని అనుకోవచ్చు.
