టికెట్ రేట్ల పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం ఉదారంగానే వ్యవహరిస్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిర్మొహమాటంగా ‘నో’ చెబుతోంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. నిర్మాతలు కూడా ‘మా సినిమా టికెట్ రేటు పెంచండి’ అంటూ ప్రభుత్వాన్ని అడగడం మానేశారు. ఎంతకంత ప్రాప్తం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆమధ్య చిత్రసీమలోని పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వాతావరణం చక్కబడుతోందనే అనిపించింది. కానీ రేవంత్ మళ్లీ తన మార్క్ చూపించారు. టికెట్ రేట్లు పెంచాలంటే ఆ ఆదాయంలో 20 శాతం కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాల్సిందే అంటూ ఓ కండీషన్ పెట్టారు. అలాగైతే టికెట్ రేట్లని చట్టబద్ధంగా పెంచి, నిర్మాతలకు సహకరిస్తామన్న సంకేతాలు పంపారు.
రేవంత్ రెడ్డి ఆలోచన బాగుంది. టికెట్ రేట్ల పెంపుతో రూ.100 అదనపు ఆదాయం వస్తే అందులో 20 రూపాయలు కార్మికులకు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరాలూ ఉండకపోవొచ్చు. కానీ సమస్య 20 రూపాయలతో కాదు. అసలు టికెట్ రేట్ల పెంపుతో అదనంగా ఎంత ఆదాయం వచ్చిందన్న విషయాన్ని ఎలా లెక్కగడతారు? అందుకు అవలంభించే విధానం ఏమిటి? అన్నది ప్రశ్నార్థకం. ఇప్పటికే నిర్మాతలు కలక్షన్ల విషయంలో తప్పుడు లెక్కలు వేస్తున్నారు. ఈగోలకు పోయి.. `మా సినిమా ఇన్ని వసూళ్లు సాధించింది` అని గొప్పలు చెప్పుకొంటున్నారు. రేపు 20 శాతం నిబంధనకు ఒప్పుకొంటే తమ వసూళ్లు బయటకు ఏరకంగా చెప్పుకొంటారు అనేది ప్రశ్న.
టికెట్ రేట్ల పెంపుదల వల్ల లాభాల మాట పక్కన పెడితే… ఫుట్ ఫాల్స్ తగ్గుతూ ఉంటాయి. రేట్లు పెంచిన ప్రతీసారీ నిర్మాత లాభపడతాడన్న రూలేం లేదు. ఓ పెద్ద సినిమా తీసి, నిర్మాత నష్టాల పాలైతే.. తనకొచ్చిన ఆదాయంలోంచి మరో 20 శాతం బయటకు తీసి, కార్మికులకు పంచమంటే పరిస్థితి ఏమిటి? బెనిఫిట్ షోలు, ప్రీమియర్ల రేటు రూ.1000 ఫిక్స్ చేసిప్పుడు నిర్మాతలకు కాస్త డబ్బు కనిపిస్తుంది. ఆ వసూళ్ల నుంచి 20 శాతం ఇవ్వడానికి బహుశా వాళ్లకు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవొచ్చు. కానీ రూ.100, రూ.50 టికెట్ రేట్లు పెంచి.. అందులోంచి 20 శాతం ఇవ్వాలంటే మాత్రం కాస్త ఇబ్బందే. టికెట్ రేట్లు పెంచినప్పుడు తప్పకుండా ఫుట్ ఫాల్స్ తగ్గుతాయి. ఆ రిస్క్ నిర్మాత తీసుకొని కూడా మరో 20 శాతం అదనంగా వదులుకోవాల్సివచ్చినప్పుడు నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారన్నది ప్రధాన ప్రశ్న.
రేవంత్ రెడ్డి ఈ 20 శాతం కండీషన్ పై నిర్మాతలతో సంప్రదించారా, వాళ్ల అభిప్రాయాలు తీసుకొన్నారా? అనేది చర్చనీయాంశం. తరచూ మన నిర్మాతలు ఆయనతో మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన పిలిస్తే చిత్రసీమ పరుగెట్టుకొని వెళ్తుంది. అలాంటప్పుడు నిర్మాతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకొంటే బాగుండేది. అసలు అదనపు రేట్ల తో వచ్చే ఆదాయంలో 20 % కార్మికులకు ఇవ్వాలన్న ఆలోచన సబబేనా? అని ఓ నిర్మాతని అడిగితే.. ”ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వం రేట్ల పెంపుదల విషయంలో కఠినంగా ఉంది. అదనపు రాబడి మార్గం పూర్తిగా ఆగిపోయింది. 20 శాతం వదులుకొన్నా, మిగిలిన 80 శాతం అయినా తిరిగి వస్తుంది కదా? ఆ లెక్కల్లో ఆలోచిస్తే నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కార్మికులకు మంచి చేయాలని నిర్మాతలు కూడా అనుకొంటారు. ఎందుకంటే వాళ్లు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది. కార్మికులకు ఈ ఆదాయాన్ని ఎలా మళ్లిస్తారు? 20 శాతంపై ఎలాంటి చట్టబద్ధత తీసుకొస్తారు? అనేది కూలంకుశంగా చర్చించాలి” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. త్వరలో నిర్మాతలంతా సమావేశమై ఈ విషయం పై లోతుగా చర్చించి, తమ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.