జగన్ రెడ్డికి ముఖ్యమైన కేసుల్లో వాదించే లాయర్ నిరంజన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు కూడా. తెలంగాణకు చెందిన ఆయనకు జగన్ లాయర్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రాజ్యసభ పదవి ఇచ్చారని అనుకుంటూ ఉంటారు. నిరంజన్ రెడ్డి సినీ నిర్మాత కూడా. చిరంజీవితో ఆచార్యను నిర్మించారు. తర్వాత సినిమాలు తీయడం లేదు. కానీ ఆయనకు సినిమా పరిశ్రమతో చాలా అనుబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయన కెరీర్ అసిస్టెంట్ డైరక్టర్ గా ప్రారంభమయింది.
సినీ పరిశ్రమ ప్రముఖ పీఆర్వో పులగం చిన్నారాయణ నిరంజన్ రెడ్డి గురించి ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మనీ సినిమాకు ఆర్జీవీ నిర్మాత. ఆయన ఆ సినిమాకు నిరంజన్ అనే కుర్రాడ్ని దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ గా తీసుకున్నారు. ఆ సినిమాకు శివనాగేశ్వరరావు దర్శకుడు. ఉత్తేజ్ దర్శకత్వ శాఖలో సీనియర్. ఆయన వద్ద నిరంజన్ పని చేశారు. ఎడిటింగ్ షీట్లను నిరంజన్ తో రాయించేవారట. నిరంజన్ పేరును టైటిల్ కార్డుల్లో కూడా వేశారు.
అయితే ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోయారని..నిర్మాతగా బయటకు వచ్చారని తెలిపారు. నిరంజన్ రెడ్డి నిర్మాతగా పలు సినిమాలు తీశారు. అంతకు మించి ప్రముఖ లాయర్ గా ఎదిగారు. జగన్ కేసులనే కాదు.. టాలీవుడ్ లో ప్రముఖుల కేసుల్ని ఆయనే వాదిస్తూ ఉంటారు.
