దాహమేసినప్పుడు బావితవ్వుకునే తెలివితేటలు కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఉంటాయి. ఆ విషయం మరోసారి అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా మరోసారి నిరూపించింది. మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు. వారిని దూరం చేసుకోకూడదు. ఆదరించాలి. ఈ కనీస మాత్రం రాజకీయం చూపించలేక …జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో అవసరం పడే సరికి రాత్రికి రాత్రి అజహరుద్దీన్ ను మంత్రిని చేస్తున్నారు. అవసరానికి ఇచ్చే ఇలాంటి పదవులు .. మైనార్టీలను మెప్పిస్తాయా.. . ఇప్పుడు ఓట్ల అవసరం వచ్చింది కాబట్టే ఇచ్చారని వాళ్లు వ్యతిరేకమవుతారా ?
తెలంగాణలో మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వకపోవడం రాజకీయ తప్పిదం
తెలంగాణ మంత్రివర్గం ఏర్పడినప్పుడు మైనార్టీ నేతకు అవకాశం కల్పించకపోవడంపై అందరూ ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ తరపున ముస్లింలు ఎవరూ గెలవలేదు. కానీ పదవి ఇవ్వాలంటే గెలవాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయినా ఇవ్వొచ్చు. ఆరు నెలల్లో ఎమ్మెల్సీ చేయవచ్చు. మంత్రి పదవులు చేపట్టడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. సీనియర్ షబ్బీర్ అలీ .. నుంచి యువనాయకుడిగా మజ్లిస్ కు ఎదురొడ్డి పోరాడుతున్న నాంపల్లి ఫిరోజ్ ఖాన్ వరకూ చాలా మంది ఉన్నారు. కానీ ఎవరి పేర్లనూ పరిశీలించలేదు. మంత్రి పదవి ఇవ్వాలనుకోలేదు. కనీసం రెండో సారి విస్తరణ చేసినప్పుడు కూడా ఆలోచించలేకపోయారు.
ఓట్ల అవసరానికి ఇప్పుడు హడావుడిగా అజహర్‌కు పదవి!
జూబ్లిహిల్స్‌లో మైనార్టీలు ఎక్కువ. ప్రభుత్వంలోతమకు ప్రాతినిధ్యం లేకపోవడం.. తమ సమస్యలపై చెప్పుకోవడానికి ఒక్క ప్రతినిధి కూడా లేకపోవడం మైనార్టీలను అసంతృప్తికి గురి చేస్తోంది. ఈ విషయంపై స్పష్టమైన సూచనలు కనిపించడంతో రాత్రికి రాత్రి మంత్రి పదవి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. గవర్నర్ వెసులుబాటును బట్టి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. కానీ ఈ పదవితో ముస్లింల మనసు గెలుచుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇదేమీ వారి ప్రాధాన్యతను గుర్తించి ఇవ్వడం లేదు. అలా అయితే ముందుగానే ఇచ్చేవారు. ఇప్పుడు వారికి ఓట్లు అవసరం కాబట్టి ఇస్తున్నారు. ఓట్ల కోసం ఇస్తున్నారని అనుకుంటే.. ఓటర్లు ఈ మంత్రి పదవి ప్రయోజనాన్ని కాంగ్రెస్ కు ఇవ్వరు.
కాంగ్రెస్ ను ఎవరో బలహీనం చేయాల్సిన పని లేదు !
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిమిత్త మాత్రమైన రాజకీయాలు చేస్తుంది. రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులను అసలు పట్టించుకోదు. తమ ఈగోలను శాటిస్ ఫై చేసుకోవడానికి నేతల్ని ఢిల్లీ పిలిపించుకుని క్లాస్ పీకుతూంటారు. కానీ క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితుల్ని చక్కబెట్టుకోవాల్సింది మాత్రం ఆ నేతలే. అటు హైకమాండ్ అడుగు ముందుకు వేయనివ్వదు..ఇటు పరిస్థితులు విషమిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చివరి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మైనార్టీకి మంత్రి పదవి అలాంటిదే. దాని వల్ల ఎంత ఉపయోగమో.. ఎన్నికల ఫలితాల తర్వాతే తెలుస్తుంది.కానీ దాహమేసినప్పుడు బావి తవ్వుకునే కాంగ్రెస్ రాజకీయాల వల్ల ఎక్కువగా నష్టమే జరుగుతుంది.
