చంద్రబాబు పని చేస్తే ప్రచారం అని ప్రచారం అని ప్రచారం చేసేవాళ్లు ఉంటారు. సమీక్షలు చేస్తే పబ్లిసిటీ స్టంట్ అని నిందలేసేవాళ్లు ఉంటారు. వాళ్లు అలా అంటాని చంద్రబాబు తన పని తాను చేయకుండా ఉండరు. ఆయన వర్కింగ్ స్టైల్ ప్రకారం ఆయన చేస్తూ ఉంటారు. ముంచుకొచ్చిన తుఫాన్ నుంచి ప్రజల్ని కాపాడుకునేందుకు తన అనుభవాన్ని అంతా ఉపయోగించి చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఒక్క ప్రాణం కూడా పోకుండా చేయగలిగారు. అదే ఆయన పనితీరుకు లభించిన ప్రతిఫలం. ప్రజలు గుర్తు పెట్టుకుంటారా లేదా అన్నది తర్వాత సంగతి కానీ చంద్రబాబు తన పై నమ్మకంతో ప్రజలు ఇచ్చిన బాధ్యతల్ని మాత్రం సంపూర్ణంగా నిర్వహిస్తారు.
ప్రాణనష్టం జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు
ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు.. ప్రాణం పోతే మాత్రం తీసుకురాలేం . ఈ విషయం అందరికీ తెలుసు. ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యతల్లో ఉన్న వారికి ఇంకా బాగా తెలియాల్సి ఉంది. కరోనా కాలంలో చచ్చిపోయిన వాళ్లు చచ్చిపోగా మిగిలిన వాళ్లను తామే కాపాడుకున్నామని ప్రకటించుకున్నట్లుగా సన్నద్ధత ఉండకూడదు. ఆ విషయంలో చంద్రబాబుకు స్పష్టత ఉంది. అందుకే తుపాను ప్రభావిత ప్రాంతాలను మొత్తం జల్లెడ పట్టించారు. వృద్ధుల్ని, గర్భిణీలను ఆస్పత్రులకు తరలించారు. మిగతా అందరికీ సురక్షితమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి.
ప్రకృతి ని ఎవరూ అడ్డుకోలేరు !
ప్రకృతి ప్రళయం సృష్టిస్తే ఎవరూ ఆపలేరు. ఒక్క చినుకు లేదా గాలిని తగ్గించే ప్రయత్నం కూడా చేయలేరు. ప్రకృతికి ఎదురెళ్లడం అసాధ్యం. కానీ ఆస్తి నష్టం.. ప్రాణ నష్టం వీలైనంత వరకూ తగ్గించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అవి మానవ ప్రయత్నం. అవి చేసుకోకుండా.. తుపాను వచ్చింది.. పోయింది.. దానికి ఎవరు ఉంటే మాత్రం ఏం చేస్తారు లాంటి కబుర్లు చెప్పడం చేతకానితనం. పని చేసే వాళ్లను కూడా వెక్కించడం దివాలాకోరుతనం. ప్రకృతి ప్రకోపం నుంచి వీలైనంత నష్టం తగ్గించి చంద్రబాబు తన పని తనాన్ని చూపించారు.
గతంలో విపత్తులు వస్తే దేవుడికి వదిలేయడమే !
గతంలో విపత్తులు వస్తే సీఎం ప్యాలెస్ లో హాయిగా ఉండేవారు. కనీసం బాధితుల్ని పరామర్శించేవారు కాదు. ఫీల్డ్ లో అధికార యంత్రాంగం పనితీరును పర్యవేక్షించేవారు కాదు. గతంలో కడపలో భారీ తుపాను వచ్చిన సమయంలో ఓ కేరళ ఎంపీ ఆ ప్రాంతానికి ఏదో పని మీద వచ్చారు. అంత పెద్ద తుపాను వస్తోంది కదా.. అధికారయంత్రాగం ఎలా సన్నద్ధమవుతుందో చూద్దామని కడప కలెక్టరేట్ కు వెళ్లారు. అక్కడ ఎవరూ లేరు. బహుశా.. అందరూ ఫీల్డుకి వెళ్లారేమో అనుకున్నారు. కానీ అక్కడి వారిని అడిగి తెలుసుకున్నది ఏమిటంటే.. రెండో శనివారం అని అందరూ ఇంట్లో పడుకున్నారు. మరి ప్రజల్ని ఎవరు పట్టించుకుంటారు?. అసలు ముఖ్యమంత్రే ఇంట్లో పడుకుంటే.. ఇంకెవరు పట్టించుకుంటారు?
అలాంటి పాలన చేసిన వాళ్లు ఇప్పుడు చంద్రబాబు పని చేస్తూంటే.. ప్రచారం కోసమని .. సిగ్గూ, ఎగ్గూ లేకుండా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వారికి ప్రజలే బుద్ది చెప్పాల్సి ఉంది.
