ఇప్పుడు తెలుగు సినిమా టార్గెట్ పాన్ ఇండియా మాత్రమే కాదు… పాన్ వరల్డ్. కంటెంట్‌పై నమ్మకంతో, ఇంగ్లీష్, స్పానిష్, జపనీస్, కొరియన్ భాషల్లో సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు, హీరోలు సిద్ధమవుతున్నారు. అయితే పాన్ వరల్డ్ టైటిల్‌తో సరిపెట్టుకోవడం సరిపోదు.. దానికి తగ్గట్టు హంగులు అద్దాలి.
ఇప్పుడు నాని అదే పనిలో ఉన్నాడు. నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ను పాన్ వరల్డ్ రిలీజ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లోనూ విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీని కోసం కొన్ని హాలీవుడ్ స్టూడియోలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని సమాచారం.
పాన్ వరల్డ్ అప్పీల్‌కి తగ్గట్టుగా ఈ సినిమాలో కొందరు హాలీవుడ్ నటులు నటించే అవకాశం ఉంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ ర్యాన్ రేనాల్డ్స్‌ను సంప్రదించినట్టు సమాచారం. ‘డెడ్‌పూల్’ చిత్రంతో పాపులరైన ర్యాన్ ‘ది ప్యారడైజ్’లో చేరితే ఓ పాన్ వరల్డ్ ఆకర్షణ తోడైనట్లే. కాకపోతే ర్యాన్ పారితోషికాన్ని టీమ్ భరించగలదా? అనేది పెద్ద అనుమానం. ర్యాన్ ఇమేజ్ గురించి, తన క్రేజ్ గురించీ మన ప్రేక్షకులకు అంతగా తెలీదు. మిగిలిన భాషల్లో ‘ప్యారడైజ్’ ఏ స్థాయిలో నిలబడగలదు? అనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం. ఓరకంగా నాని సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేయడం ఓరకంగా ప్రయోగమే. అందుకోసం ర్యాన్ లాంటి స్టార్ ని దింపి, అతనికి భారీ పారితోషికం ఇచ్చుకోవడం అవసరమా? అనే అనుమానం కూడా వేస్తుంది. కానీ ఎవరో ఒకరు, ఎక్కడో ఓచోట ముందడుగు వేయాలి కదా? నాని ఇప్పుడు అదే చేయబోతున్నాడేమో?
