రోజూ రెండు వేల మంది వస్తారు.. ఇవాళ ఇంత మంది వస్తారని ఊహించలేదు అని.. కాశీబుగ్గ ప్రైవేటు ఆలయ నిర్వాహకుడు పండా ఆవేదన చెందారు. బహుశా ఆయనకు సోషల్ మీడియా మీద అవగాహన ఉండి ఉండదు. ఫలానా రోజు మంచిది అని ప్రచారం చేస్తే జనం తండోపతండాలుగా ఆలయాలకు పోటెత్తుతున్నారు. కార్తీక శనివారం గురించి అలాగే ప్రచారం జరగడం.. ఏకాదశి కలసి వచ్చిందని పండితుల పేరుతో వీడియోలు ఉదరగొట్టడంతో జనం ఆలయాల మీద పడిపోయారు. దీనికి కారణం ఈ కార్తీక్ శనివారం గురించి సోషల్ మీడియాల్లో విపరీత ప్రచారం చేసిన వారే.
ఫలానా రోజు గొప్పదని సోషల్ మీడియా పండితుల ప్రచారాలు
సోషల్ మీడియా తెచ్చి పెడుతున్న విపత్తుల్లో తొక్కిసలాటలు కూడా ప్రధానంగా ఉంటాయి. దేవుడ్ని ఫలానా రోజు దర్శించుకుంటే.. పూజలు చేస్తే ఆయన కరుణిస్తాడని.. వరాలు కురిపించేస్తాడని కొంత మంది పండితులమని చెప్పుకునేవారు ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ దేవుడి దర్శనం కోసం అలా తొక్కుకుంటూ వెళ్లాల్సిన పని లేదు.. ఫలానే రోజే అద్భుతం అని చెప్పలేమని చాగంటి, గరికపాటి వంటి వారు ఎన్నో సార్లు భక్తులకు తెలిసేలా చెప్పారు. కానీ మాటల్ని ఎంతో శ్రద్ధగా ఆలకించేవారు కూడా వాటిని పట్టించుకోరు.
దర్శించుకుంటే దేవుడు ఏదో ఇచ్చేస్తాడని సూక్తులు
పరిస్థితి ఎంత ఘోరంగా మారుతుందంటే.. జనవరి ఒకటో తేదీన ఎలాంటి విశిష్టమైన రోజు కానప్పటికీ గుళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇక విశిష్టమైన రోజు అని తెలిస్తే ఊరుకుంటారా?. తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని వైకుంఠ ద్వారం ద్వారా చేసుకోవాలని గతంలో పెద్దగా అనుకునేవారు కాదు. కానీ సోషల్ మీడియా మేధావులు ఆ రోజు విశిష్టత గురించి విపరీతంగా ప్రచారం చేసి.. ఆ రోజు దర్శనం చేసుకుంటే ఇక దేవుడు ధనధాన్యాలు.. కురిపిస్తాడని ప్రచారం చేయడంతో.. ఆ రోజున దర్శనం కోసం వెళ్లి తొక్కుకుని చనిపోయినా తప్పు లేదన్నట్లుగా మారిపోతున్నారు.
చాగంటి, గరికపాటి చెప్పినా దేవుడి దర్శనం సూక్ష్మాన్ని అర్థం చేసుకోని మూఢభక్తులు
అందరూ దేవుడ్ని దర్శించుకుంటున్నారు అంటే.. నిజంగా ఏదో లాభం ఉంటుందనే.. మనం కూడా ఎందుకు దర్శించుకోకూడదన్న ఓ మైండ్ సెట్ తోచాలా మంది వారి వెనుకే వెళ్లిపోతూంటారు. నిజంగా భక్తులు ఎవరైనా కాస్త స్థిమితంగా ఆలోచిస్తే.. దేవుడి దర్శనాన్ని ఇలా తోసుకుని చేసుకోవడం కన్నా.. ప్రశాంతంగా ఓ చోట కూర్చుని ధ్యానం చేసినా దేవుడ్ని స్మరించుకున్నట్లే అవుతుందని గుర్తిస్తారు. కానీ సోషల్ మీడియా పండితుల వల్ల ఆలోచనా శక్తిని భక్తులు కోల్పోయారు. ఇప్పుడు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
