కేంద్ర ఎన్నికల సంఘం .. సమగ్ర ఓట్ల జాబితా సవరణను చేపట్టింది. ప్రస్తుతం పన్నెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో ఈ పక్రియ ప్రారంభమయింది. త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో కూడా ఈ ప్రక్రియ ప్రారంభమయింది. అయితే ఇది ముస్లింలకు వ్యతిరేకమని చెప్పి అక్కడ డీఎంకే నేతృత్వంలో రాజకీయాలు ప్రారంభమయ్యాయి. సర్ ప్రక్రియను తమిళనాడులో కొనసాగించకుండా ఏం చేయాలా అని స్టాలిన్ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. కానీ దీనికి ఆయన కూటమిలోని పార్టీలే హాజరయ్యాయి. అలాగని ఇతర పార్టీలు సమర్థిస్తున్నాయని కాదు.
“సర్”కు వ్యతిరేకమంటున్న విజయ్
అఖిలపక్ష భేటీకి విజయ్ పార్టీకి కూడా డీఎంకే ఆహ్వానం పొందింది. ఇలాంటి రాజకీయాల్లో ఇరుక్కోకూడదని అనుకున్న విజయ్ ఆహ్వానాన్ని తిరస్కరించారు. కానీ ఓటర్ల జాబితా సవరణను తాము వ్యతిరేకిస్తున్నామని అది .. మైనార్టీలకు ఓట్లను తొలగించడానికి పెట్టిన ప్రక్రియ అని అభిప్రాయపడింది. అంటే.. ఓటర్ల జాబితాలో తప్పొప్పులను దిద్దడానికీ తాము వ్యతిరేకమని తమిళనాడులో బీజేపీ మినహా అన్ని పార్టీలు చెబుతున్నట్లుగా అయింది.
బీజేపీని కూటమిలో చేర్చుకోవాలని అన్నాడీఎంకే ప్రయత్నాలు
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జరుగుతున్న రాజకీయాల్లో విజయ్ పార్టీని కూటమిలో చేర్చుకునేందుకు అన్నాడీఎంకే గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వారి చేతిలో ఇప్పుడు కరూర్ తొక్కిసలాట కేసు ఉంది. మెల్లగా ఒత్తిడి ప్రారంభిస్తున్నారు. ఎలా అంటే.. బీజేపీ , అన్నాడీఎంకే విజయ్ పొత్తులు పెట్టుకోవడం ఖాయం అన్నట్లుగా సంకేతాలు పంపుతున్నారు. బీజేపీ మార్క్ రాజకీయాలు ఎలా ఉంటాయో తమిళనాడులోనూ స్పష్టత ఉంది. స్టాలిన్ కూడా అయితే బీజేపీ వైపు వెళ్లిపోవాలి..లేకపోతే మా కూటమిలో ఉండాలి అన్నట్లుగా రాజకీయాలు చేస్తారు. రెండింటి మధ్య ప్రయాణం చాలా కష్టం.
విజయ్ పై ముందు ముందు తీవ్ర ఒత్తిడి
ఇప్పటికైతే.. విజయ్ బీజేపీతో కానీ అన్నాడీఎంకేతో కానీ అవగాహన ఉంటుందని ఎలాంటి సంకేతాలు పంపడం లేదు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆయన వీలైనంత మౌనం పాటిస్తున్నారు. బీజేపీ వ్యతిరేకత విషయంలో తాను మెత్తబడుతున్నా అన్న అభిప్రాయం వస్తే మొత్తం రాజకీయం మారిపోతుంది. అలాంటి అభిప్రాయం తీసుకు రావాలని డీఎంకే కూడా రాజకీయాలు చేస్తోంది. రెండు వైపుల నుంచి వస్తున్న దాడిని ప్రస్తుతం విజయ్ ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో అసలు పరీక్ష ఉంటుంది. కానీ ఇప్పుడు విజయ్ అసలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అనుకోవచ్చు.
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              