ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాల సీజన్ నడుస్తోంది. వరుసగా పెద్ద ఎత్తున మరణాలు జరిగే విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం, కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలు ఇంకా చర్చనీయాంశంగా ఉండగానే హైదరాబాద్ శివారులోని మరో ఘోర ప్రమాదం జరిగిది. తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడ్ తో వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్లో ఉన్న కంకర బస్సుపై పడిపోయింది. అందులో ప్రయాణికులు కూరుకుపోయారు. ఫలితంగా మృతుల సంఖ్య పెరిగింది.
చేవెళ్ల మండలం ఖానాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వారాంతం తర్వాత హైదరాబాద్ కు వివిధ పనుల మీద వచ్చేవారు ఎక్కువగా ఉంటారు. సమీప ప్రాంతాల నుంచి ఉదయమే కాలేజీలకు విద్యార్థులు బస్సుల్లో వస్తూంటారు. ఈ కారణంగా బస్సులో కనీసం 70 మంది వరకూ ఉన్నట్లుగా అంచనా. అంత మందితో వస్తున్న బస్సును నిర్లక్ష్యంగా నడుపుతున్న టిప్పర్ డ్రైవర్ వచ్చి ఢీకొట్టారు. వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో బస్సు టిప్పర్ కింద ఇరుక్కుపోయింది. కంకరలో కూరుకుపోయే ఎక్కువ మంది చనిపోయారు.
ప్రమాదంలో అటు బస్సు, ఇటు లారీ డ్రైవర్లతో పాటు ఇరవై మంది వరకూ చనిపోయారు. పలువురిని చేవెళ్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు ప్రమాదంపై సీఎం సహా అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయ చర్యలకు జేసీబీలను.. అధికారులను పంపించారు. సహాయ చర్యలను వెంటనే చేపట్టడంతో.. కొంత మంది ప్రాణాలను కాపాడగలిగారు.
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              